calender_icon.png 25 January, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ బూమ్.. గ్రీన్ ఎనర్జీ బూస్ట్

25-01-2025 01:21:02 AM

‘తెలంగాణ రైజింగ్ టీం’ దావోస్ టూర్.. గ్రాండ్ సక్సెస్

  1. ఫలించిన రాష్ట్రప్రభుత్వ ద్విముఖ వ్యూహం
  2. ‘ఏఐ సిటీ’ ఆలోచనకు గ్లోబల్ మార్కెట్ ఫిదా
  3. ఇన్వెస్టర్లను ఆకర్షించిన ‘పునరుత్పాదక ఇంధన’ పాలసీ
  4. మొత్తం 1.78 లక్షల కోట్ల పెట్టుబడుల్లో.. ఈ రెండు రంగాలకే 1.74 లక్షల కోట్లు
  5. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు రాష్ట్రం అడుగులు

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ద్విముఖ వ్యూహం ఫలించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ.. గ్రీన్ ఎనర్జీ పాలసీలతో ప్రముఖ కంపెనీలతో పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్‌కు గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చింది.

ప్రపంచ ఆర్థిక రంగ యవనికపై తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సారథ్యంలో ‘తెలంగాణ రైజింగ్’ బృందం వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నుంచి మొత్తం రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగా, వాటిలో రూ.1.74లక్షల కోట్లు ఏఐ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు సంబంధించినవి కావడం గమనార్హం.

ఒప్పందాల ప్రకారం ఆయా కంపెనీలు తెలంగాణలో ఏఐ ఆధారిత డేటా సెంటర్లు, పునరుత్పాదక విద్యుత్ రంగానికి సంబంధించిన యూనిట్లను నెలకొల్పనున్నాయి. దీంతో రాష్ట్రం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని రాష్ట్రప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. హైదరాబాద్‌లో ఏఐ సిటీని అందుబాటులోకి తెస్తే, ఇక్కడ రెండేళ్లలోనే ఏఐ విస్తరణ జరుగుతుందని అంచనా వేస్తున్నది.

ఐటీ ఎగుమతులతో 200 బిలియన్ డాలర్ల లక్ష్యం.. 

వచ్చే దశాబ్దాన్ని ఇండియా టెక్కేడ్ అని గతేడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగానే మానవాళిపై అత్యంత ప్రభావం చూపనున్న ఏఐ సాంకేతికత అభివృద్ధి, నైపుణ్యాలపై దృష్టి సారించింది. కేంద్రం వ్యూహాత్మక ఆలోచనలను అంచనా వేసిన రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలోనూ ఏఐ సెక్టార్‌ను విస్తరించాలని నిర్ణయించింది.

రాష్ట్రం నుంచి ప్రస్తుతం ఐటీ ఎగుమతుల విలువ 30 బిలియన్ డాలర్లు ఉండగా, ఏఐ సాయంతో 2030 నాటికి ఎగుమతులను 200 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగానే ఇటీవల సీఎం 200 ఎకరాల్లో ఏఐ సిటీని ప్రతిపాదించింది.

కొనసా గింపుగా గతేడాది ఆగస్టులో ‘ఏఐ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించింది. అలాగే ఏఐ సిటీ కాన్సెప్ట్‌తో ఇన్వెస్టర్ల దృష్టిని కూడా ఆకర్షించి, ఆయా కంపెనీలతో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిస్తున్నది. తద్వారా ఆధారిత డేటా సెంటర్ల ఏర్పాటుకు బాటలు వేసింది.

 ఏఐ సెక్టార్‌లో భారీగా ఉద్యోగాలు..

ప్రపంచం మొత్తం ఇప్పుడు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై వైపు చూస్తున్న ది. ఆ దిశగానే భారత్ సైతం అడుగులో వేస్తున్నది. ఏఐ ఆధారిత నైపుణ్యాభివృద్ధిలో ఇతర దేశాల కంటే భారత్ ముందంజలో ఉందని ‘స్టాన్‌ఫోర్డ్ 2024’ ఏఐ నివేదిక వెల్లడిస్తున్నది. ఏఐ నైపుణ్యభివృద్ధిలో అమెరికా రేటింగ్ 2.2 కాగా, భారత్ రేటింగ్ 2.8 కావడం గమనార్హం. 

ఏఐ నియామకాల వార్షిక వృద్ధి రేటులో తమిళనాడులోని కొయంబత్తూరు 58శాతంతో దేశంలోనే టాప్-1 స్థానంలో నిలవగా, బెంగళూరు 41శాతంతో రెండు స్థానం, హైదరాబాద్ 36శాతంతో మూడోస్థానంలో నిలుస్తున్నాయి. అలాగే పుణె, ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు సైతం నియమాకాల్లో పోటీ పడుతున్నాయి.

అలాగే ప్రతి వంద ఉద్యోగాల్లో బెంగళూరులో అత్యధికంగా 26శాతం మంది ఏఐ సెక్టార్స్‌లోనే జాబ్స్ పొందుతుండగా, హైదరాబాద్‌లో ప్రతి వంద ఉద్యోగాల్లో 10శాతం ఏఐ సెక్టార్‌కు చెందినవే ఉంటున్నాయి. ఈ విభాగంలో హైదరాబాద్ దేశంలోనే టాప్ నిలుస్తున్నది. 

కలిసొచ్చిన గ్రీన్‌ఎనర్జీ పాలసీ

వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12న గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించింది. ఆ తర్వాత 15 రోజులకే సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు.

డబ్ల్యూఈఎఫ్ వేదికగా సీఎం సారథ్యంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం గ్రీన్ ఎనర్జీ పాలసీని పారిశ్రామికవేత్తలకు వివరించింది. తద్వారా పాలసీ ద్వారా రూ.66 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది.  అంటే.. పదేళ్లలో సాధించాల్సిన లక్ష్యంలో సర్కార్ ఇప్పటికే 32శాతం పెట్టుబడులు సాధించిందన్న మాట.