calender_icon.png 30 September, 2024 | 11:00 PM

తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ సంకేతం బతుకమ్మ

30-09-2024 08:53:01 PM

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ముందస్తూ బతుకమ్మ సంబరాలు

జగిత్యాల,(విజయక్రాంతి): తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ సంకేతం బతుకమ్మ ముందస్తు సంబు రాలు సోమవారం జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అంబరాన్ని తాకాయి. బతుకమ్మ సంబరాల్లో ముఖ్య అతిథిలుగా మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి,  జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత లు పాల్గొన్నారు. విద్యార్థినుల ఆటపాటలు ఆహుతులను ఎంతగానో అలరించి ఉత్సాహపరిచారు. మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి మాట్లాడుతూ దేవతలను పూలతో పూజిస్తే, ఆ పూలనే పూజించి గౌరవించే సంస్కృతి సంప్రదాయాలు మన తెలంగాణలో ఉన్నాయని, బతుకమ్మ పండుగ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని ఇది ఒక విశిష్టమైన సాంస్కృతిక వారసత్వమైన పండుగ అని, ఈ పండుగను  విద్యార్థులు కోలాహలంగా ఆనందంగా ఆడుతూ ఉంటే రంగురంగుల పూలన్నీ ఒక చోట చేరినట్టుగా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ స్ఫూర్తినిచ్చిందనీ గుర్తు చేశారు.

తెలంగాణ సమాజానికి సింగిడి లాంటిది బతుకమ్మ అని,సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ అంటూ ప్రకృతిని మహిళలని గౌరవించే ఉదాత్త సంస్కృతి నిదర్శనం అన్నారు. తెలంగాణ సంస్కృతిని ఇక్కడ జీవన విధానాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ సామాజిక సాంస్కృతిక ప్రాకృతిక సౌందర్యానికి సముచిత ఉదాహరని కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలువకుంట రామకృష్ణ, బతుకమ్మ పూలను ఒక్కొక్క మెట్టు పేర్చిపై అంతస్తులో గౌరీ దేవతను కూర్చోబెట్టినట్టుగా విద్యార్థులు తమ సమస్యలను అధిగమిస్తూ ఒక్కొక్క మెట్టు పైకి వస్తూ జీవితంలో శిఖరాయమానంగా నిలిచి ఉండాలని మాజీ జెడ్పీ చైర్ పర్సన్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షురాలు దావ వసంత తెలిపారు. ప్రకృతిని దైవంగా భావిస్తూ... ప్రకృతి సంరక్షించుకోవాలన్న సందేశాన్ని తీసుకొచ్చే అంతర్లీన స్ఫూర్తిని అందించే గొప్ప పండుగ అని స్త్రీ వైద్య నిపుణులు సిపిడిసి సెక్రటరీ జి.శ్రీలత వెల్లడించారు. బతుకమ్మ పూల పండుగ మహిళల్లో ఉన్న ఐక్యతను చాటి చెప్పుతున్నదని ఈ మహిళా ఐక్యత  స్ఫూర్తిదాయకమని మున్సిపల్ కౌన్సిలర్ చుక్కా నవీన్ అన్నారు.

విద్యార్థినులు కళాశాల అధ్యాపక సిబ్బంది, సాంప్రదాయక వస్త్రాలను ధరించి జతకట్టి ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ అంటూ ప్రకృతిని దైవంగా భావిస్తూ రంగురంగుల పూలను పేర్చి బతుకు అమ్మ అంటూ దీవించే బతుకమ్మ పండుగ గునుగు చామంతి తంగేడు బంతి పట్టుకుచ్చులు గోరింటా రకరకాల రంగుల పూలతో అందంగా పేర్చి లయబద్ధంగా సర్వాంగ సుందరంగా కళాశాల ప్రాంగణమంతా శోభిల్లేలా సంబరాలు సాగాయి. చప్పట్లతో బతుకమ్మను ఆడారు. ఆట పాట రంగవల్లికలతో కళాశాల మైదానం సకల వర్ణాలతో అలరారింది. ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో కళాశాల మహిళా సాధికారత విభాగం ఎన్ఎస్ఎస్ విభాగం నిర్వహించిన ముందస్తు బతుకమ్మ సంబరాలలో మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త శ్రీమతి వాసవి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీస్ అధికారులు సంగీతారాణి, సుజాత, శ్రీలత అధ్యాపకులు డాక్టర్ జమున సునీత, జ్యోత్స్న, సమత, వైస్ ప్రిన్సిపాల్ చంద్రయ్య, డాక్టర్ ప్రమోద్ కుమార్, రహీం, వరప్రసాద్ బోధన, బోధనేతర  సిబ్బంది, విద్యార్థినులు, ప్రజాప్రతినిధులు పూర్వ విద్యార్థులు  బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. కళాశాల  ప్రగతి పథంలో ముందుకు సాగాలని, తమ వంతు సహాయం చేస్తామని అతిథులు పేర్కొన్నారు.