calender_icon.png 15 January, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహా.. ఏమి రుచి!

25-10-2024 12:00:00 AM

దీపావళి వచ్చిందంటే అందరి నోళ్లు తీపి కావాల్సిందే. ఆ రోజు చాలామంది స్వీట్లు ఇచ్చి పుచ్చుకుంటూనే ఉంటారు. బంధువులకు, స్నేహితులకు స్వీటు బాక్సులు పంపిస్తారు. అయితే మార్కెట్లో చేసినవి కాకుండా ఇంట్లో చేసిన స్వీట్ అయితే బంధం మరింత బలపడుతుంది. అలా ఇంట్లోనే సులభంగా చేసుకునే స్వీట్స్‌పై ఓ లుక్కేయండి..

గులాబ్ జామ్

తయారుచేసే విధానం: ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ కట్ చేసి పిండిని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళుపోసి కలపాలి. ఆ పిండిని ఒక పది నిముషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. పక్కనే మరో స్టవ్ కూడా వెలిగించి, వేరే గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి లేత పాకం పట్టాలి. 

ఆ పాకంలో యాలుకల పొడి కలుపుకోవాలి. తరువాత కలిపిన పిండిని తీసుకుని చిన్నచిన్న ఉండలుగా చేసి, కాగే నూనెలో చిన్న మంట మీద దోరగా వేగనివ్వాలి. అలా వేగిన ఉండల్ని తీసి పాకంలో వెయ్యాలి.

పది నిమిషాలు అలాగే ఉంచితే పాకం పీల్చుకొని గులాబ్ జామ్ తినటానికి రెడీగా ఉంటాయి. రుచికరమైన గులాబ్ జామ్ తయారీకి పిండి కలిపేటప్పుడు అందులో కాస్త పన్నీర్ కలిపితే జామ్ మృదువుగా ఉంటాయి. అలాగే పిండిని కలిపే సమయంలో జీడిపప్పులను పొడిగా కొట్టి కలిపితే రుచితో పాటు వెరైటీగా ఉంటాయి.

గవ్వలు

 తయారు చేసే విధానం : ముందుగా మైదాపిండి, బొంబాయి రవ్వని జల్లెడ పట్టి అందులో సరిపడా ఉప్పు వేసి తర్వాత పాలు పోయాలి. దీన్ని గట్టిగా పూరీల పిండిలా కలుపుకుని పక్కన పెట్టాలి. గంటన్నర దాటిన తర్వాత ఈ పిండిని గవ్వల చెక్క మీద పెట్టి ఉండలుగా చేసి బొటన వేలితో వత్తాలి.

గవ్వలను సిద్ధం చేసుకున్న తర్వాత స్టౌవ్ వెలిగించి ఒక పాత్రలో నూనె వేసి కాగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గవ్వలను వేసి బాగా వేయించాలి. గవ్వలు వేయించాక చక్కెరలో ఓ గ్లాసు నీళ్లు వేసి ముదురు పాకం పట్టి అందులో ఆ గవ్వలను వేసి బాగా కలపాలి. అంతే రుచికరమైన గవ్వలు తయారైపోతాయి. 

తీపి భూచక్రాలు

తయారు చేసే విధానంః ముందుగా మైదా పిండి తీసుకొని చిటికెడు ఉప్పు, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసి చపాతీ పిండి ముద్దలా చేయాలి. దీన్ని అరగంటసేపు నానబెట్టుకోవాలి. చపాతీ పిండిని పూరీలా వత్తి రోలింగ్ చేయాలి. మధ్యలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కొద్దిగా పిండి వేసి, తర్వాత దీన్ని చాకుతో చిన్న చిన్న భాగాలుగా చేసి, భూచక్రాల ఆకారంలో వత్తుకోవాలి.

తర్వాత నూనెలో ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి. దీనికి రెండు గంటల ముందు పాలలో చక్కెర, కుంకుమ పువ్వు వేసి ఓ పక్కన ఉంచుకోవాలి. పాలను వేడిచేసి వేయించిన భూచక్రాలను అందులో వేయాలి. చివరగా డ్రైఫ్రూట్స్ వేసి అలకరించుకోవాలి. ఈ వంటకాన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మెత్తగా కాజాల్లా ఉండే ఇవి నోట్లో వేసుకోగానో కరిగిపోతాయి.  

మైసూర్ పాక్

తయారు చేసే విధానం : మైసూర్ పాక్ తయారీ కోసం శనగపిండిని జల్లెడ పట్టాలి. స్టౌవ్ మీద పాత్ర పెట్టి దాంట్లో కొద్దిగా డాల్డా లేదా నెయ్యి వేసి అడుగంటకుండా దోరగా వేయించుకోవాలి. గిన్నెలో కొద్దిగా నీరు, చక్కెరను వేసి పాకం వచ్చేంత వరకు పొయ్యి మీద ఉంచాలి. పాకం తయారైన తరువాత దాంట్లో శనగపిండి వేసి గట్టిపడే వరకు ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి.

వేడి చేసి పెట్టుకున్న నెయ్యి శనగపిండిలో పోయాలి. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పిండి గుల్లలుగా తయారవుతుంది. తర్వాత మరోసారి నెయ్యి వేసి కలుపుకుని ఒక నలు చదరంగా ఉండే ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి చాకుతో ముక్కలుగా కోసుకొని పది నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి. దీంతో రుచికరమైన మైసూర్ పాక్ రెడీ. 

బ్రెడ్ కాజా

తయారు చేసే విధానం : బ్రెడ్ స్లుసైస్ అంచులు తీసేసి ముక్కలుగా కట్ చేయాలి. స్టవ్ మీద పాత్ర పెట్టి వేయించడానికి సరిపడా నూనె అందులో వేయాలి. కట్ చేసిన బ్రెడ్ ముక్కలను దోరగా వేయించుకోవాలి. వేయించిన ముక్కలను కిచెన్ పేపర్ మీదకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఓ పాత్రలో చక్కెర, నీళ్లు వేసి పాకం పెట్టుకోవాలి. స్టవ్ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలపాలి. అందులో యాలకుల పొడి వేసుకొని ఓసారి స్టవ్ మీద నుంచి దించేయాలి. చివరగా తురుముకున్న డ్రై ఫ్రూట్స్‌ను బ్రెడ్ మీద చల్లుకుంటే సరిపోతుంది.