calender_icon.png 18 October, 2024 | 5:37 PM

పత్తి క్షేత్రాలను సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

18-10-2024 03:48:11 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, నాగపూర్ జాతీయ పత్తి పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి మండలంలోని మాల గురజాల గ్రామంలో అధిక సాంద్రత పత్తి సాగు క్షేత్రాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు సందర్శించారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ రైతులతో మాట్లాడుతూ.. ఆహార భద్రత మిషన్ కింద ఉత్తమ పద్ధతుల ద్వారా పత్తి ఉత్పాదకాలు పెంచే విధంగా మంచిర్యాల జిల్లాలో 425 ఎకరాల్లోని రైతు క్షేత్రాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మాల గురుజాల గ్రామంలో అధిక సాంద్రత పత్తి సాగు చేపడుతున్న దుర్గం సుమన్, కలాలి సంతోష్ ల క్షేత్రాల్లో పర్యటించి వారి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నారు. నాగపూర్ (సి ఐ సి ఆర్) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ మహాజన్ అధిక సాంద్రత పత్తి సాగు ప్రాధాన్యత, నేలల రకాలు, విత్తన ఎంపిక, సమగ్ర కలుపు, పోషక, చీడపీడల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతు క్షేత్రాలను సందర్శించిన వారిలో బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ తిరుపతి, డాక్టర్ నాగరాజు, రాశి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫీల్డ్ స్టార్ సంతోష్, కృషి విజ్ఞాన కేంద్రం ప్రొఫెషనల్స్ డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శైలజ, డాక్టర్ అనిల్ లతోపాటు పత్తి సాగు చేస్తున్న రైతులు పాల్గొన్నారు.