calender_icon.png 24 September, 2024 | 7:55 PM

పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

24-09-2024 05:27:57 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని తోర్నాల ఏరువాక కేంద్రం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డా.శ్రీజయ, డా.పల్లవి, డా.శ్వేత, డా.ఉమారాణి, డా. రమాదేవి, సరితలు  మాచపూర్, చంద్లాపూర్, చిన్నకోడూరు, మోటుపల్లి, ఇబ్రహీంనగర్, గోనేపల్లి గ్రామాల్లో పర్యటించి వరి, ప్రత్తి, మొక్కజొన్న, కంది పంట లను పరిశీలించారు. వరి పంట పొట్ట దశ నుండి ఈనే దశలో ఉన్నందున 40 కిలోల యూరియ, 15 కిలోల మ్యురాట్ అఫ్ పోటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా బురద పొలంలో వేసుకోవాలన్నారు.

ఈ దశలో కాండం తొలుచు పురుగు ఉదృతి వలన తెల్ల కంకులు ఏర్పడే అవకాశం ఉన్నదున దాని  నివారణకు కార్టొప్ హైడ్రాక్లోరైడ్  50SP @ 2గ్రా. లేదా ఎసిపేట్ 75SP @ 1.5గ్రా.  ఒక లీటరు నీటికి  కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ నెలలో కురిసిన వర్షాలకు బాక్టిరియా ఎండకు తెగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ తెగులు నివారణకు నత్రజని ఎరువులు వేయడం తాత్కాలికంగా ఆపివేయాలని, తెగుల్లను అరికట్టుటకు ఎగ్రిమైసిన్ ౦.4గ్రా. లేదా ప్లాంటమైసిన్ లేదా పోషమైసిన్ ౦.2గ్రా. వారం వ్యవదిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

మొక్కజోన్నలో ప్రస్తుతం ఉన్న దశలో  కత్తెర పురుగు ఉదృతి తక్కువగానే ఉన్నప్పటికీ, నివారణకు క్లోరాంట్రానీలిప్రోల్ 0.4మీ.లి/ లీ లేదా స్పైనోటోరామ్ ౦.5మీ.లి ఒక లీటరు నీటికి కలిపి మొక్క సుడిలో మందు ద్రావణం పడేటట్టు పిచికారి చేయాలి.  కందిలో అధిక వర్షాలకు ఎండుతెగులును గమనించామన్నారు. ఈ తెగులు సోకినా మొక్కలు పూర్తిగా కాని కొంత బాగం కాని ఎండిపోతాయి. తెగులు వ్యాపించకుండా ఉండడానికి మెటాలక్సిల్ 2గ్రా. లేదా కాపర్ఆక్సిక్లోరైడ్ ౩ గ్రా. లీటరు నీటికి కలిపి తెగులు సోకిన మొక్కల చుట్టూ తడిసేలా పోయాలని చెప్పారు.

కందిలో గొడ్డుమోతు తెగులు ఉన్నట్లు తెలిపారు. ఈ తెగులు సోకిన మొక్క విపరీతంగా చిన్న ఆకులను తోడుగుతూ పూత పూయదు. దిని నివారణకు నీటిలో కరిగే గంధకం ౩గ్రా. లేదా ఫెన్ పైరక్సిమెట్ 1మీ.లి ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రత్తిలో పూత, పిందే రాలడం గమనించడం జరిగింది. కావున దాని నివారణకు 1మీ.లి ప్లానోఫిక్స్ ఐదు లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ప్రస్తుత బెట్ట పరిస్టితులలో ప్రత్తిలో రసం పిల్చు పురుగుల ఉదృతి ఉందన్నారు. వాటి నివారణకు ఎసిపేట్ 1.5గ్రా. ఎసిటమిప్రిడ్ ౦.2గ్రా. లేదా థైయోమెథాక్సమ్ ౦.2గ్రా. లేదా ఎమిడాక్లోప్రిడ్ ౦.25మీ.లి ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.