11-02-2025 11:06:13 PM
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
పెండింగ్ సన్న రకం బోనస్ పై నివేదిక సిద్ధం చేయాలి
ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలో రైతులను కలిసి మాట్లాడిన జిల్లా కలెక్టర్
ఖమ్మం (విజయక్రాంతి): ఉన్న భూమి వనరుల నుంచి రైతులు అధిక ఆదాయం సంపాదించేలా వ్యవసాయ సాగు చేయాలని, అధునాతన పద్ధతులను పాటించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్, ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలో పర్యటించి రైతులతో వివిధ అంశాలపై ముచ్చటించారు. రైతు రుణమాఫీ, సన్న రకం వడ్లకు బోనస్, ఇతర సమస్యలపై రైతుల వెంబటి పంట పొలాల్లో బురదలో చెప్పులు లేకుండా నడుస్తూ కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ... 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న లక్ష 34 వేల మంది రైతుల వరకు ఖమ్మం జిల్లాలో రుణమాఫీ జరిగిందని, ఆధార్ కార్డు వివరాల నమోదు, బ్యాంకు సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి రుణమాఫీ అందలేదని, సంబంధిత రైతుల జాబితా ప్రభుత్వానికి పంపామని అన్నారు.
జిల్లాలో సన్న రకం ధాన్యం కొనుగోలు చేసి బోనస్ క్రింద దాదాపు 140 కోట్లు చెల్లించామని కలెక్టర్ తెలిపారు. సన్న రకం ధాన్యం పెండింగ్ బోనస్ వివరాలను రైతుల వారిగా ట్రాక్ చేయాలని, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదిస్తూ త్వరలో రైతులకు పెండింగ్ బోనస్ చెల్లిస్తామని అన్నారు. సాదా బైనామా దరఖాస్తులు కొత్తగా నమోదు చేసుకునేందుకు ఇప్పుడు అవకాశం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అవకాశం వస్తే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పట్టాదార్ పాస్ పుస్తకం లో భూమి తక్కువగా నమోదయిందని తెలుపగా, ఎంజాయ్మెంట్ సర్వే చేసి సమస్య పరిష్కారానికి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
రైతుల బ్యాంకు వివరాలు సరిగ్గా నమోదు కాలేదని పంపినప్పటికి బ్యాంకులలో పెండింగ్ ఉండటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే సంబంధిత రైతుల వివరాలను సవరించి దరఖాస్తులను బ్యాంకు మేనేజర్ లు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, లీడ్ బ్యాంకు మేనేజర్ కు ఫోన్ చేసి ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేసే రైతు రుణ మాఫీ, సన్న రకం ధాన్యం బోనస్, రైతు సంక్షేమ పథకాల డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో ఇతర రుణాల క్రింద జమ చేయడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామంలో 3 వేల జనాభాకు ఒకే స్మశాన వాటిక ఉందని, మరో స్మశాన వాటిక ఏర్పాటుకు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపాలని, తప్పనిసరిగా మంజూరు చేస్తామని కలెక్టర్ అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఏ.ఓ., ఏ.ఈ.ఓ. లు, రెవిన్యూ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు