దౌల్తాబాద్,(విజయక్రాంతి): రైతులకు నాసిరకం, కాలం చెల్లిన విత్తనాలు ఎరువులను విక్రయించకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను మాత్రమే ఫర్టిలైజర్ దుకాణ యజమానులు విక్రయించాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి రాధిక అన్నారు. గురువారం రాయపోల్ మండలం వడ్డేపల్లి, అంకిరెడ్డిపల్లి, ఎల్కల్ గ్రామాలలో ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ... నాసిరకం విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫర్టిలైజర్ దుకాణాలలో రైతులు విత్తనాలు కానీ ఎరువులు కానీ కొనుగోలు చేస్తే తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అధిక ధరలకు విక్రయాలు జరిపితే ఉపేక్షించేది లేదన్నారు. విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల స్టాక్ రిజిస్టర్ విధిగా నిర్వహించాలన్నారు. ఫర్టిలైజర్ దుకాణాలు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, ఏఈఓ లు పాల్గొన్నారు.