18-02-2025 01:45:34 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): తెలంగాణ జనాభా 3.70కోట్లు కాగా.. మెజార్టీ శాతం మందికి వ్యవసాయమే జీవనాధారమని తెలంగాణ ప్రభు త్వం పేర్కొంది. రాష్ట్రంలో 1.5కోట్ల మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతుండగా.. వారిలో 51శాతం మందికి వ్యవసాయం, అనుబంధ రంగాలతోపాటు మైనింగ్ విభాగం ఉపాధిని అందిస్తోందని చెప్పింది.
సోమవారం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ (అట్లాస్)- 2023-24 పుస్తకాన్ని సచివాలయం లో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆవిష్కరించారు. ఇందులో ప్రభుత్వం కీలక విషయాలను వెల్లడించింది. ఉపాధి కల్పనలో తయారీ రంగం 12శాతంతో రెండో స్థానంలో ఉంది.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఐటీ, రియల్ ఎస్టేట్, సేవల రంగాలు 24.4శాతంతో కీలకపాత్ర పోషిస్తున్నాయని సర్కారు చెప్పింది. తెలంగాణ నెలసరి ఆదాయాన్ని రూ. 3,12,522గా పేర్కొంది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949తో టాప్‌లో ఉన్నట్లు పేర్కొంది.
తగ్గిన వార్షిక వృద్ధిరేటు
గత రెండేళ్లలో వార్షిక వృద్ధిరేటు తగ్గినట్లు అట్లాస్ నివేదిక పేర్కొంది. 2021-22లో వృద్ధి రేటు 19.19శాతం ఉంటే, 2022- 23లో 16.70శాతమని తెలిపింది. ఈ క్రమం లో ఈ ఏడాది జాతీయ వృద్ధిరేటు10.4 శాతం కాగా.. తెలంగాణ వృద్ధి రేటు 12.6 శాతమని చెప్పింది. రాష్ట్రంలో వివిధ రంగా ల్లో ఏడాదికి 1,37,19,879 మందికి 183 రోజుల కంటే ఎక్కువ రోజులు పని లభిస్తున్నట్లు నివేదిక చెప్పింది.
ఎస్సీ జనాభా 54లక్షలు..
2023-24 ఎస్సీలు 54,08,800 ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇందులో జిల్లాల వారీగా జనాభా పరంగా చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 2,47,927మంది ఉన్నా రు. కానీ శాతం వారీగా చూస్తే.. 24.7శాతంతో మంచిర్యాల మొదటిస్థానంలో ఉంది. రాష్ట్రంలో ఎస్టీల జనాభా 31,77,940 కాగా.. వీరిలో మెజార్టీ శాతం ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉన్నారు.
పురుషుల కంటే మహిళలే అధికం
రాష్ట్ర జనాభాలో పురషుల కంటే మహిళలే అధికంగా ఉన్నట్లు నివేదిక చెప్పింది. రాష్ట్ర జనాభాలో పురుషులు 49.7శాతం కాగా.. మహిళలు 50.3 శాతం ఉన్నారు. లింగ నిష్పత్తిని చూసుకుంటే ప్రతి వెయ్యిమంది పురుషులకు స్త్రీలు 988 మంది ఉన్నారు. జిల్లాల వారీగా చూసుకుంటే రంగారెడ్డిలో ప్రతి వెయ్యిమంది పురుషులకు తక్కువగా 950 స్త్రీలు ఉండగా.. నిర్మల్‌లో అత్యధికంగా 1046 మంది ఉన్నారు.