22-04-2025 01:16:58 AM
సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం
సాగులో ఆధునికతను జోడించండి: మంత్రి తుమ్మల
* ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో పూడి కతీత పనుల కోసం ఈ నెలాఖరులోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తాం. కాళేశ్వరం పెండింగ్ పనులతో పాటు గుత్ప ఎత్తిపోతల పథకం పనుల పూర్తికి నిధులను కేటాయిస్తాం. భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవసరమైన చోట విరివిగా చెక్ డ్యామ్ లు నిర్మించేలా చూస్తాం.
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నిజామాబాద్, ఏప్రిల్ 21: (విజయ క్రాంతి): సేంద్రియ వ్యవసాయంతోపాటు, ఆధునిక సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా వ్యవసాయ మెళుకువలను అందించడానికి రైతు మహోత్సవం ఎంతగానో ఉపకరిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుంచి 23 వరకు కొనసాగనున్న రైతు మహోత్సవం కార్యక్రమం సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. బోర్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి పసుపు రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు, పసుపు ఆధారిత పరిశ్రమలు, ఉత్పత్తులకు కూడా కేంద్రం చొరవ చూపాలని కోరారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతాంగానికి నష్ట పరిహారం సైతం అందించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి ప్రకటించారు. తెలంగాణాలో ఉన్నది రైతు ప్రభుత్వమని, రైతాంగ సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఆధునిక సాగు, కొత్త పంటలపై రైతులకు మూడు రోజుల ఈ మహోత్సవంలో శాస్త్రవేత్తలు, నిపుణులు అవగాహన కల్పిస్తారని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అత్యంత లాభదాయకమైన పామాయిల్‌ను సాగు చేయాలని, జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించే బాధ్యత తనదేనని భరోసా కల్పించారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు.
కాళేశ్వరం పెండింగ్ పనులు పూర్తి చేస్తాం: ఉత్తమ్
నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఎంతో ఉపయుక్తంగా నిలిచే ఈ తరహా సదస్సులను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో పూడికతీత పనుల కోసం ఈ నెలాఖరులోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరం పెండింగ్ పనులతో పాటు గుత్ప ఎత్తిపోతల పథకం పనుల పూర్తికి నిధులను కేటాయిస్తామన్నారు.
భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవసరమైన చోట విరివిగా చెక్ డ్యామ్ లు నిర్మించేలా చూస్తామని అన్నారు. గత ఖరీఫ్, రబీ సీజన్లను కలుపుకుని 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట తెలంగాణాలో ఉత్పత్తి అయ్యిందని, దేశంలోని మరే ఇతర రాష్ట్రాలలో ఇంత పెద్ద ఎత్తున వరి సాగు కాలేదని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వపరంగా కొనుగోలు చేస్తూ, వారికి పూర్తిస్థాయి మద్దతు ధర అందిస్తున్నామన్నారు.
దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణలోని 84 శాతం జనాభాగా ఉన్న సామాన్య, పేద కుటుంబాలకు కూడా తమ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రైతాంగానికి తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్నారు. కాగా రైతు మహోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తులు, అధిక దిగుబడులను అందించే అధునాతన వంగడాలు, మేలు జాతి పశువులు, ఆహార పదార్థాల ప్రదర్శనకు దాదాపు సుమారు 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.