17-04-2025 08:12:13 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలం సారంగపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్ సందర్శించారు. గురువారం మండల వ్యవసాయ అధికారి కిరణ్మయితో కలిసి కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రైతులు వరి పొలంలో బాగా ఆరిన తర్వాత మాత్రమే కోతలు చేపట్టాలని, వరి ఆకులు పూర్తి స్థాయి పసుపు, ఎరుపు రంగు కలగలిసిన రంగులోకి మారినప్పుడు బాగా ఆరినట్లు గుర్తించి కోతలు చేపట్టాలని సూచించారు.
వరి కోతల సమయంలో గింజల్లో తేమ శాతం 14 నుంచి 17 శాతం ఉండే విదంగా చూసుకోవాలని, హార్వెస్టర్ ఫ్యాన్ బ్లోయర్ వేగం 18 నుంచి 20 ఉంచినట్లైతే తాలు, తప్ప, పొల్లు లేని నాణ్యమైన ధాన్యాన్ని పొందవచ్చని, తద్వార మద్దతు ధర లభిస్తుందన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చే ముందు ప్రతి రైతు ఏఈఓ వద్ద పంట సాగు వివరాలను పోల్చి చూసుకోవాలని సరిపడా వివరాలు కొనుగోలు కేంద్రం వద్ద అందచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు ముత్యం తిరుపతి, కనకరాజు, రైతులు ఫిరోజ్, ఎగుడ రాయమల్లు, లింగా రెడ్డి, గౌస్ లు పాల్గొన్నారు.