calender_icon.png 7 February, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిట్టుబాటు వేతనం కోసం రాస్తారోకో చేసిన వ్యవసాయ కూలీలు..

07-02-2025 08:04:19 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో గిట్టుబాటు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కూలీలు శుక్రవారం ఆందోళన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. గత ఏడాది వరకు మిర్చి కోతకు వచ్చే కూలీలకు రూ.350 లను వేతనంగా చెల్లించేవారు. ఈ ఏడాది పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పరిసర మండలాలైన కరకగూడెం, మణుగూరు, ములుగు జిల్లా రాజుపేట ప్రాంతాల నుంచి రూ.250లు చెల్లించి కూలీలను తీసుకువచ్చి మిర్చి కోతలకు రైతులు ఉపయోగిస్తున్నారు. దీంతో స్థానిక రైతులకు వ్యవసాయ కూలీ దక్కక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ కూలీలందరు ఏకమై పోలీస్ స్టేషన్ సమీపంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో ఆందోళన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు.

వ్యవసాయ కూలీల ఆందోళనకు మద్దతు తెలిపిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ మధుసూదన్ రెడ్డి ఆందోళనను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ కూలీల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం వ్యవసాయ రైతు కూలీలకు రూ.385 లు చెల్లించాలని అన్నారు. కొంతమంది భూ యజమానులు వాహనాలను ద్వారా తక్కువ కూలీరేట్లకు పక్క మండలాల నుండి కూలీలను తీసుకువచ్చి వారిని వంచించడమే కాకుండా స్థానిక కూలీలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే ప్రభుత్వంతో పోరాడాలి కానీ రైతు కూలీల పొట్ట కొట్టడం దారుణం అన్నారు. ఇప్పటికైనా రైతులు వ్యవసాయ కూలీలకు తగిన వేతనం చెల్లించాలని కోరారు.