తాము పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని బుధవారం రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రైతులు గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా రైతులు పలుచోట్ల ధర్నా చేశారు. మహమ్మద్‌నగర్ మండలం కోలమంచకు చెందిన రైతులు బోధన్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొనుగోళ్ల ప్రక్రియను రైతులు పట్టించుకోవడం లేదని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి గోదాములకు తరలించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు సమాచారం అందుకుని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అనంతరం నాయకులు జిల్లా కేంద్రానికి చేరుకుని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌కు వినపతిపత్రం అందించారు.
లబోదిబోమంటున్న రైతులు
కొనుగోలు కేంద్రాలకు వ్యయప్రయాల కోర్చి ధాన్యం తీసుకొచ్చినా కొను గోళ్లు ఆలస్యమవుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్లాల్లో ధాన్యం ఆరబెట్టి, తూకం వేసి 20 25 రోజులు దాటుతున్నా, వాటిని మిల్లలకు తరలించడంలేడని రైతులు వాపోతున్నారు. ఈలోపు అకాల వర్షం వచ్చి వడ్లు తడిసినా, వడ్లలోకి దుమ్మూ ధూళి చేరినా నిర్వాహకులు ధాన్యం కొనడం లేదు. లేనిపోని సాకులు చూపి మద్దతు ధర తగ్గిస్తున్నది. మద్దతు ధరలు ఎక్కడా అమలు కావడం లేదని, ఎంత మంచి ధాన్యానికైనా నిర్వాహకులు క్వింటాకు రూ.2,143 చొప్పున ధర నిర్ణయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లులకు ధాన్యం లోడ్ లారీలు చేరుకున్న తర్వాత అన్‌లోడింగ్ చేయించడం లోనూ మిల్లర్లు, అధికారులు శ్రద్ధ చూప డం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లుల వద్ద హమాలీల సంఖ్య పెంచమన్నా పట్టించుకున్న పాపాన లేదని వాపోతున్నారు. అన్ని అడ్డంకులు దాటి చివరకు ధాన్యం విక్రయించినా సకాలంలో బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము జమ కావడం లేదని, డబ్బు ఎప్పుడు జమ అవుతుందా? అని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు.
నేలమట్టమైన వరి పైరు..
వికారాబాద్, మే 15 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో బుధవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. గాలిదుమారానికి పట్టణ శివారులోని చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల ఇంటి పైకప్పులు లేచికిందపడ్డాయి. వరి పైరు నేలమట్టమైంది. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
వారంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్
పెద్దపల్లి జిల్లాలో వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో బుధవారం ధాన్యం కొనుగోళ్ల పై పౌరసరఫరాలశాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటివరకు 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మరో 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే లక్ష్యాన్ని అధిగమిస్తామన్నారు.