calender_icon.png 16 January, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగర్వాల్, శ్రీహరికి పసిడి

12-09-2024 12:57:31 AM

జాతీయ అక్వాటిక్ చాంపియన్‌షిప్

మంగళూరు: తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ 77వ జాతీయ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో మరోసారి మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టుల్ విభాగంలో వృత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. 1500 మీటర్ల రేసును 17 నిమిషాల 45.63 సెకన్లలో పూర్తి చేసి పసిడి పట్టగా.. షిరిన్ (17 నిమిషాల 50.61 సెకన్లు), భవ్య సచ్‌దేవ (18 నిమిషాలు) రజత, కాంస్యాలు ఒడిసిపట్టారు. కాగా మంగళవారం 400 మీ ఫ్రీస్టుల్ ఈవెంట్‌లో వృత్తి రజతం నెగ్గిన సంగతి తెలిసిందే. ఇక పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టుల్ ఈవెంట్‌లో భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

శ్రీహరి రేసును 50.59 సెకన్లలో పూర్తి చేశాడు. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టుల్ విభాగంలో బిహార్‌కు చెందిన మహి స్వేత్‌రాజ్ (58.54 సెకన్లు) పసిడి పట్టగా.. అదితి సతీశ్, శివంగి శర్మ (59.17 సెకన్లు) రెండో స్థానంలో నిలిచారు. ఇక మిక్స్‌డ్ 4x100 మీ మెడ్లేలో జాతీయ రికార్డు నమోదైంది. తమిళనాడుకు చెందిన ప్రమితి జ్ఞానశేఖరన్, ధనుశ్ సురేశ్, రోహిత్, దీక్షాలతో కూడిన క్వాడ్రెట్ బృందం రేసును (4 నిమిషాల 5.30 సెకన్లు) పూర్తి చేసి రికార్డు నెలకొల్పి పసిడి చేజెక్కించుకుంది. గత రికార్డు మహారాష్ట్ర బృందం (4 నిమిషాల 6.84 సెకన్లు) పేరిట ఉంది. పురుషుల 200 మీ మెడ్లే ఈవెంట్‌లో వినాయక్ విజయ్, మహిళల 200 మీ మెడ్లే విభాగంలో మాన్వయ్ వర్మ స్వర్ణాలు గెలుచుకున్నారు.