27-03-2025 01:09:13 AM
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
జనగామ, మార్చి 26(విజయక్రాంతి): బీమా రంగానికి ఏజెంట్లే వెన్నెముక అని, వారికి నష్టం చేకూర్చేలా బీమా సంస్థలు తీసుకొచ్చిన మార్పులు సరికావని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన జీరో అవర్‌లో మాట్లాడారు. భారతదేశ బీమా రంగానికి వెన్నెముకగా నిలిచే ఈ ఏజెంట్లు, ఎల్‌ఐసీసీ రెగ్యులేటరీ అధికారులు విధించిన ఇటీవలి పాలసీ మార్పుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. ఏజెంట్లకు మొదటి సంవత్సరం కమీషన్ 35 శాతం నుంచి 28 శాతానికి తగ్గించడం వల్ల వారి ఆదాయానికి గండి పడుతోందన్నారు.
పాలసీదారుడు ఐదేళ్లలోపు పాలసీని సరెండర్ చేస్తే, ఏజెంట్లు వారి కమీషన్లో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వాలనే క్లాజ్ని ప్రవేశపెట్టిన నిబంధన వారికి నష్టం చేకూర్చేలా ఉందన్నారు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ పాలసీదారులను నిరుత్సాహపరుస్తోందన్నారు. బీమా వంటి ముఖ్యమైన సేవలపై అధిక పన్ను విధించడం బీమా వ్యాప్తిని పెంచడం అనే ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. కమీషన్ కోతలను పునఃపరిశీలించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు.