calender_icon.png 23 October, 2024 | 3:07 PM

బిల్లులు రాక ఏజెన్సీలు డీలా!

15-09-2024 12:30:38 AM

  1. ఎనిమిది నెలలుగా 
  2. సరుకులు సమకూర్చలేక నిర్వాహకుల పాట్లు 
  3. బిల్లులు విడుదల చేయాలని నిర్వాహకుల వేడుకోలు

నిర్మల్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు వసతుల కల్పించాలనేది ప్రభుత్వ ధ్యేయం. కానీ, ఏజెన్సీ నిర్వాహకులకు సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో నిర్మల్ జిల్లాలో గురుకులాలకు సక్రమంగా నిత్యావసర సరుకులు అందడం లేదు. మరోవైపు ఎనిమిది నెలల నుంచి బిల్లులు విడుదల కాకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు సరుకులు సమకూర్చలేక ఇబ్బంది పడుతున్నారు. బిల్లులు విడుదల కాకపోవడంతో సరుకులు ఎలా సమకూర్చగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 విద్యాసంవత్సరంలో జిల్లాలోని మైనార్టీ, బీసీ, ఎస్సీ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సరకులు సమకూర్చేందుకు సర్కార్ టెండర్లు ఆహ్వానించింది.

జిల్లాలో ఆరు బీసీ గురుకులాలు, ఏడు ఎస్సీ గురుకులాలు, 5  ఎస్టీ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇంటర్ వరకు ఉన్న గురుకులాల్లో 640 మంది చొప్పున, పదోతరగతి వరకు ఉన్న గురుకులాల్లో 480 మంది చొప్పున, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 4,800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరంతా కూడా ఆయా క్యాం పస్‌ల్లోనే ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వం వారికి నాణ్యమైన చదువు తో పాటు పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలి. భోజనానికి అవసరమయ్యే నిత్యావసర సరకుల్లో బియ్యం మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తుండగా.. వంటకు ఉపయోగించే క్యాటరింగ్‌తో పాటు కూరగాయలు, పప్పులు, నూనెలు, చింతపండు, దొడ్డు రవ్వ, సన్న రవ్వ, అటుకులు, పండ్లు, గుడ్లు, మాంసం, చికెన్‌తో పాటు మొత్తం 24 రకాల వస్తువులకు టెండర్లు వేస్తుంది. టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలు వాటన్నింటినీ సరఫరా చేయాల్సి ఉంటుంది.

ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో మొత్తం 17 గురుకులాలకు సరుకుల సమకూర్చేందుకు టెండర్లు జరిగింది. తీవ్రమైన పోటీ మధ్య ఒక్కో కోడిగుడ్డుకు రూ.5, కిలో మటన్‌కు రూ.500, కిలో చికెన్‌కు రూ.220, కూరగాయలకు కిలోకు రూ. 28 చొప్పున టెండర్ వేసి కొందరు దక్కించుకున్నారు. దీనికి తోడు వంట సామగ్రికి అవసరమయ్యే పప్పులు, ఉప్పులు, నూనెలు, మసాలా, ఫలహారానికి అవసరమయ్యే సామగ్రి కోసం మార్కెట్ ధర కంటే పది శాతం తక్కువ టెండర్లు వేసి 60 మంది దక్కించుకున్నారు. ఆ తర్వాత ప్రతిరోజూ గురుకులాలకు అవసరమయ్యే సరుకులు సరఫరా చేస్తున్నారు. 

కష్టాలు.. అప్పులు ఇలా..

ఒక నెలలో సరుకులు సరఫరా చేసిన తర్వాత సర్కార్ ఆ తర్వాతి నెల 5వ తేదీలోపు బిల్లులు విడుదల చేయాల్సి ఉన్నది. కానీ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఏజెన్సీలకు ప్రభుత్వం పైసా అయినా విడుదల చేయలేదు.  ఎనిమిది నెలల బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలు నెలలో నాలుగు సార్లు మటన్, ఎనిమిది సార్లు గుడ్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇక కూరగాయలైతే ప్రతితిరోజూ సరఫరా చేయాల్సిందే. దీంతో నిర్వాహకులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సరుకులు సమకూరుస్తున్నారు.

ఒక్కో ఏజెన్సీకి రూ.లక్షలు విడుదల కావాల్సి ఉన్నది. కానీ, టెండర్ ప్రకారం సరుకులు సమకూర్చకుంటే చెడ్డపేరు వస్తుందనే భయంతో అప్పులు చేసి మరీ సరుకులు సరఫరా చేస్తున్నారు. అప్పులపై వడ్డీలకు వడ్డీల భారం పడుతున్నదని, ఇలా అయితే తమకు గిట్టుబాటు కాదని లేదని నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే ఇక తమకు ఆత్మహత్యలే చేసుకోవాల్సి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆందోళనకు కార్యాచరణ..

బిల్ల్లులు విడుదల కాకపోవడంతో 60 మంది ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. కలెక్టర్, ఆర్సీవోలపై ఒత్తిడి చేసి బిల్లులు రాబట్టుకోవాలని నిర్ణయించారు. సర్కార్ బిల్లులు చెల్లించని పక్షంలో ఏజెన్సీలను రద్దు చేసుకుని తమ దారి తాము చూసుకుందామని నిర్ణయించారు. ఒకవేళ ఏజెన్సీలు రద్దు చేసుకుంటే పరిస్థితి ఏంటని విద్యాసంస్థల ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే చాలామంది ఏజెన్సీ నిర్వాహకులు ప్రిన్సిపాళ్లతో చర్చలు జరిపి బిల్లులు రాకపోతే సరుకులు సమకూర్చలేమని అల్టిమేటం జారీ చేశారు.

అప్పులు చేసి తిప్పలు పెడుతున్నాం

నేను మైనార్టీ, బీసీ గురుకులాలకు 20 ఏండ్ల నుంచి సరకులు సరఫరా చేస్తున్నా. ఎప్పుడూ ఇన్ని రోజుల బిల్లులు పెండింగ్‌లో ఉండేవి కావు. ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి సరఫరా చేస్తున్నాం. ప్రతి నెలా సర్కార్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలి. మా వద్ద పనిచేసే కార్మికులకు ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. జీతాలు ఇవ్వకపోతే వారు పనిచేస్తలేరు. అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నాం. 

 రమేశ్, మూఠాపూర్, 

ఏజెన్సీ నిర్వాహకుడు