calender_icon.png 18 November, 2024 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్‌వాడీలకు ఏజ్ లిమిట్!

29-06-2024 01:41:26 AM

అంగన్‌వాడీ సెంటర్ల ప్రక్షాళనకు కసరత్తు

  1. టీచర్లు, ఆయాలకు వయోపరిమితి
  2. 65 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్
  3. జిల్లాలో ఖాళీ కానున్న 73 పోస్టులు

మెదక్, జూన్ 28(విజయక్రాంతి): అంగన్‌వాడీ కేంద్రాల ఉద్యోగుల ప్రక్షాళనకు సర్కారు సిద్ధమైంది. వయోభారంతో ఉన్న టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ కల్పించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావించినా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. ప్రస్తుతం అంగన్‌వాడీ ఉద్యోగుల వివరాల సేకరణ పూర్తయింది. 

జిల్లా వ్యాప్తంగా 73 మంది

జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం నాలుగు ప్రాజెక్టులు ఉన్నా యి. 1076 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వాటిల్లో 18,804 మంది పిల్లలు ఉన్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు.  అయితే ప్రభుత్వం 65 ఏళ్ళు నిండిన అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు వయోపరిమితిని పరిగణలోకి తీసుకుని ఉద్యోగ విరమణ ఇవ్వాలని నిర్ణ యించింది. దీంతో జిల్లాలో మొత్తం 73 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేసి అంగన్‌వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. 

వయోపరిమితిపై పేచీ..

అంగన్‌వాడీ కేంద్రాలలో 65 ఏళ్ల పైబడిన వారు జిల్లాలో 73 మంది ఉన్నారు. వీరందరు ఈనెలలో లే దా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. టీచర్ల వయోపరిమితి లెక్కించడంలో అధికారులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. కానీ ఆయాలకు విద్యార్హతలు లేకుండా ఉద్యోగాలలో నియమించడంతో వయోపరిమితిని లెక్కించడం సమస్యగా మారింది. కొం తమంది ఉద్యోగులు తమ పుట్టిన తేదీ సరిగ్గా లేని కారణంగా విధుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన తేదీ సరిగ్గా లేనివారిని జిల్లా ఆస్పత్రుల్లో వయస్సు నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. 

పదవీ విరమణ బెనిఫిట్స్‌పై చిన్నచూపు

ఉద్యోగ విరమణ పొందే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు  రూ.50వేలు చెల్లిస్తామని ప్రకటించింది. వయోపరిమితి కారణంతో హఠాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదని పలు కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. అంగన్‌వాడీ టీచర్లకు రూ.5 లక్షలు, ఆయాలకు  రూ.3 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

జాబితా ప్రభుత్వానికి అందించాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలలో 65 ఏళ్లు నిండిన వివరాలు సేకరించాం. నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 73 మంది ఉన్నారు. ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. కొందరి వయస్సు నిర్ధారణకు సమస్యలు తలెత్తాయి. కొందరు వయస్సు తప్పుగా నమోదైందని ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో వయస్సు నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించాం. ఉద్యోగులు నిర్ధారణ సర్టిఫికెట్లు తీసుకొస్తున్నారు. 

 డి.బ్రహ్మాజీ, 

మెదక్ జిల్లా సంక్షేమాధికారి