calender_icon.png 4 October, 2024 | 10:46 PM

ఆగమాలు

04-10-2024 12:00:00 AM

వేద విజ్ఞానం :

‘ఆగమం’ అంటే వేదం అని ఒక అర్థం. మరొక అర్థం సంప్రదాయ పూర్వకంగా పూజాది కాలు ఎలా నిర్వహించాలో, ఆలయ నిర్మాణం ఎలా చెయ్యాలో మొదలైన విషయాలను తెలిపే శాస్త్రం. ఆగమాలు వేదంలో భాగం కాదు. కాని, వేదంలో చెప్పిన అత్యుత్తమ పురుషార్థం మోక్షం. దీన్ని సాధించడానికి పూజాదికాలు మొదలైనవి మనం ఎలా నిర్వహించాలో, దానికి కావలసిన సంస్కారాలను విహితం చేసేవి ఆగమాలు. ప్రాచీన కాలం నుంచి అనేక ఋషి పుంగవులు మనకు అందించిన ఆధ్యాత్మిక సంపద ఇవి. 

ఆగమాలు మూడు విధాలు. శైవాగమాలు శివార్చనకు సంబంధించినవి; శక్త్యాగమాలు అమ్మవారి అర్చావిధానాన్ని తెలిపేవి; వైష్ణవాగమాలు విష్ణువుని ఆరాధించే విధానాన్ని తెలిపేవి. ఇవి రెండు విధాలు -పాంచరాత్రాగమం, వైఖానసాగమం.

ప్రతి ఆగమంలోను నాలుగు భాగాలు ఉంటాయి అవి. (1) జ్ఞానపాదం. దీనిలో సంబంధిత ఆగమ సిద్ధాంతం, తత్త్వం, అధ్యాత్మ విద్య, సత్యస్వరూపానికి సంబంధించిన జ్ఞానం, మోక్షమార్గం ఉంటాయి. (2) యోగపాదం . ఇందులో యోగ శాస్త్ర విశేషాలు, ఇంద్రియ నిగ్రహం ఎలా సాధించాలనే విషయాలు ఉంటాయి. (3) క్రియాపాదం . దీనిలో పూజా విధానం, ఆలయ నిర్మాణ పద్ధతులు, వాస్తు విషయాలు, విగ్రహ శిల్పాలకు చెందిన విషయాలు, విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసే విధానం, అనేక రకాల దీక్షలను తీసుకొనే విధానం ఉంటాయి. (4) చర్యపాదం. ఇందులో పూజా విధానం, అనేక రకాల కైంకర్యాలు చేసే విధానం, ఉత్సవ నిర్వహణ, ప్రాయశ్చిత్తాలు ఉంటాయి.

ఏదైనా ఒక ప్రదేశాన్ని దివ్యదేశంగా అంటే పుణ్యక్షేత్రంగా గుర్తించడానికి మూడు ప్రధానాంశాలను ఆగమం నిర్దేశిస్తుంది. అవి స్థలం అంటే పవిత్రమైన అర్చామూర్తి ఉన్న స్థలం. తీర్థం అంటే ఆలయానికి ఆనుకొని ఉండే పుష్కరిణి. మూర్తి అంటే ప్రాణప్రతిష్ఠ చేయబడిన అర్చామూర్తి.

‘ఆగమం’ అంటే ‘మిత్రునివలె వచ్చి చేరేది’ అని కూడా అర్థమూ ఉంది. వేదాలు సంప్రదాయబద్ధంగా గురువు నుండి శిష్యునికి మిత్రునివలె చేరేవి గనుక ఆగమాలు అనే పేరు వచ్చింది.

‘శ్రీ వేదభారతి’ సౌజన్యంతో, 

‘వేదాంత పరిభాష’ నుంచి..

 కళానిధి సత్యనారాయణ మూర్తి