calender_icon.png 25 October, 2024 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ అదానీ దుమారం

03-07-2024 02:36:35 AM

  • తెరపైకి కోటక్ మహీంద్రా బ్యాంక్ 
  • అదానీ షేర్లతో లబ్ది  కోసం విదేశాల్లో కోటక్ ఫండ్ ఏర్పాటు

న్యూఢిల్లీ, జూలై 2: ఏడాదిన్నర క్రితం స్టాక్ మార్కెట్లో, రాజకీయ వర్గాల్లో పెను వివాదం సృష్టించిన అదానీ ఉదంతం తిరిగి తెరపైకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదికి సన్నిహిత మిత్రు డిగా విమర్శలకు గురవుతున్న గౌతమ్ అదా నీ గ్రూప్ పలు స్టాక్ మార్కెట్ అవకతవకలకు పాల్పడిందని, ఆఫ్‌షోర్ ఫండ్స్ ద్వారా తన షేర్లను కృత్రిమంగా పెంచుకుంటున్నదని యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ 2003 జనవరిలో విడుదల చేసిన నివేదికతో 150 బిలియన్ డాలర్లకుపైగా మార్కెట్ విలువను అదానీ గ్రూప్ కోల్పోయింది. ఆ గ్రూప్ షేర్లు నిలువునా కుప్పకూలాయి.

ఈ పతనాన్ని లాభంగా మలుచుకునేందుకు ఒక అజ్ఞాత ఇన్వెస్టర్లకు ఉదయ్ కోటక్ నేతృత్వంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ సహకరిం చిందంటూ తాజాగా మంగళవారం హిండెన్‌బర్గ్ ఒక సంచలన ఆరోపణ చేసింది. అదానీషేర్ల ద్వారా తాము లబ్ది పొందామంటూ భారత్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి తమకు జారీచేసిన షోకాజ్ నోటీసుపై స్పం దిస్తూ అదానీ గ్రూప్ సెక్యూరిటీలపై తమ షార్ట్ పొజిషన్లు ఉన్నాయని అప్పట్లోనే వెల్లడించామని హిండెన్‌బర్గ్ వివరించింది. ఆ షార్ట్ పొజిషన్ల ద్వారా తాము పొందిన లాభం కేవలం 4 మిలియన్ డాలర్లేనని వెల్లడించింది.

అయితే ఆ షోకాజ్ నోటీసులో కోటక్ బ్యాంక్ పేరును ఎందుకు ప్రస్తావించలేదంటూ సెబీని హిండెన్‌బర్గ్ ప్రశ్నించింది. కోటక్ బ్యాంక్ ఇండియాకు సంబంధించినదైనందున ఆ బ్యాంక్ పేరును, ఉదయ్ కోట క్ నెలకొల్పిన బ్రోకరేజ్ సంస్థలను సెబీ నోటీసులో కావాలనే దాచిపెట్టిందని యూఎస్ హెడ్జ్ ఫండ్ ఆరోపించింది. అదానీ గ్రూప్‌పై బెట్ చేయడానికి  తమ భాగస్వామ్య ఇన్వెస్టరు  ఆ బ్యాంక్, బ్రోకరేజ్ సంస్థలే విదేశాల్లో ఏర్పాటు చేసిన ఫండ్‌ను ఉపయోగించుకున్నట్టు హిండెన్‌బర్గ్ వెల్లడించింది. అయితే ఆ ఇన్వెస్టరు ఎవరనేది వెల్లడించలేదు.

నోటీసులో కోటక్ పేరుకు సెబీముసుగువేసిందని, కె ఆపర్చూనిటీస్ ఫండ్, కేఎంఐఎల్ అని ప్రస్తావించిందని, కేఎంఐఎల్ అంటే కొటక్ మహీం ద్రా ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ అనే ఒక అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని హిండెన్‌బర్గ్ వివరించింది. ఒక శక్తివంతమైన భారతీయ వాణిజ్యవేత్తను (ఉదయ్ కోటక్) స్క్రూటినీ నుంచి రక్షించేందుకే కోటక్ పేరును దాచిపెట్టినట్టు తెలిపింది.  సెబీ షోకాజ్ నోటీసును ఒక ‘నాన్సెస్’గా అభివర్ణించింది. ఇప్పటివర కూ ఆదానీ గ్రూప్ తమ ఆరోపణలకు సమాధానమివ్వలేకపోతున్నదని, తాము లేవ నెత్తిన కీలక అంశాలన్నింటినీ విస్మరిస్తున్నదని, మీడియా వార్తలకు ఖండనలు మాత్ర మే ఇస్తున్నదని హిండెన్‌బర్గ్ పేర్కొంది. 

సెబీ 46 పేజీల నోటీసు

సెబీ నుంచి తమకు 46 పేజీల షోకాజ్ నోటీసు జూన్ 27న అందిందని హిండెన్‌బర్గ్ తెలిపింది. పెనాల్టీల విధింపు, భారత్ క్యాపిటల్ మార్కెట్ నుంచి నిషేధించడం తదితర చట్టపరమైన చర్యలు చేపట్టేముందు ఈ షోకాజ్ నోటీసును రెగ్యులేటర్ జారీచేస్తుంది. అదానీ గ్రూప్‌పై నివేదిక విడు దల చేసే కొన్ని నెలల ముందు 2022 ఆగస్టులో హిండెన్‌బర్గ్, కింగ్‌డన్ (ఇన్వెస్టరు) మధ్య ఏర్పడిన భాగస్వామ్యం ఏర్పడిందని, అదానీ స్టాక్స్‌లో కిండ్‌డన్ పొజిషన్లు క్రియేట్ చేసుకున్నాక నివేదిక విడుదల చేశారని సెబీ ఆ నోటీసులో ఆరోపించింది. తమ ఆరోపణలకు 21 రోజుల్లో సమాధానమివ్వాలని హిండెన్‌బర్గ్‌ను ఆదేశించింది. 

హిండెన్‌బర్గ్‌తో ఎలాంటి సంబంధం లేదు: కోటక్

తమ సబ్సిడరీ కోటక్ మహీంద్రా ఇంటర్నేషనల్ లిమిటెడ్ (కేఎంఐఎల్)కు, కోటక్ ఇండియా ఆపర్చూనిటీస్ ఫండ్‌కు (కేఐఓఎఫ్) హిండెన్‌బర్గ్ క్లయింటు లేదా ఇన్వెస్టరు కాదని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. తమ ఫండ్ ఇన్వెస్టర్లు ఎవరికీ హిండెన్‌బర్గ్ భాగస్వామిగా ఉన్నట్టు తెలియదని పేర్కొంది. ఫండ్ ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులు ఎవరి తరపునా చేయడం లేదన్న డిక్లరేషన్ కూడా తీసుకున్నట్టు తెలిపింది. కేఐఓఎఫ్ ఇన్వెస్టర్లను  కేవైసీ నిబంధనల ప్రకారమే చేర్చుకుంటుందని పేర్కొంది. తాజా వివాదం నేపథ్యంలో మంగళవారం కోటక్ మహీంద్ర బ్యాంక్ షేరు 2.5 శాతం క్షీణించి, రూ.1,763 వద్ద ముగిసింది.