06-03-2025 10:34:03 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, నెలలో ఒకటి రెండు సార్లు క్యాంపు ఆఫీసుకు వచ్చి వెళ్తున్నాడని, సీనియర్ కార్యకర్తలను, నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని బెల్లంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అఫ్జల్ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గురువారం రాత్రి యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి పట్టణ మాజీ అధ్యక్షులు ఎలుక ఆకాష్ అన్నారు. ఎమ్మెల్యే వినోద్ గెలిచిన నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉండు అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాడని చెప్పారు. గడ్డం కుటుంబానికి చెందిన విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోర్వెల్ లు వేయించుకున్న మొదటి వ్యక్తి అఫ్జలే అని అన్నారు.
40 ఏళ్లుగా ఎవరు పట్టించుకోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయ రోడ్డును పూర్తి చేయడంలో ఆయన ప్రత్యేకంగా కృషి చేశారని చెప్పారు. నియోజకవర్గంలో మూడు జూనియర్ కళాశాలలను తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే వినోద్ కే దక్కిందన్నారు. నిస్వార్ధంగా ప్రజల బాగోగులను పట్టించుకుంటున్న ఎమ్మెల్యే వినోద్ పై అసత్యమైన ఆరోపణలు చేయడం ఎంత మాత్రం సరికాదన్నారు. ఎమ్మెల్యే వినోద్ పై బురదజల్లే విధంగా ఆరోపణలు చేసిన మహమ్మద్ అఫ్జల్ వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తన వార్డులో పోటీ చేసి గెలుపొందాలని సవాల్ విసిరారు.