calender_icon.png 2 October, 2024 | 9:58 PM

ఎంసీఏ చదివి.. నిరుద్యోగిగా మారి

04-09-2024 12:00:00 AM

మహబూబ్‌నగర్, విజయక్రాంతి :

‘ఎలాగైనా తెలంగాణ సాధించుకుందాం. అప్పుడే ప్రతిబిడ్డకు న్యాయం జరుగుతుంది’ అనే లక్ష్యంతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుదీప్‌రెడ్డి ఉద్యమబాట పట్టాడు. ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే.. తనలాంటివారిని భాగస్వామ్యం చేశాడు. ఉద్యమమే ఊపిరిగా బతికి చివరకు నిరుద్యోగిగా మారాడు. ఎంసీఎ లాంటి ఉన్నత చదువులు చదివినా ప్రభుత్వ ఉద్యోగం కలగానే మారిపోయింది. ఈ సందర్భంగా ఆనాటి ఉద్యమగుర్తులను విజయక్రాంతితో పంచుకున్నారాయన. 

మాది మధ్య తరగతి కుటుం బం. కష్టపడి చదివి కుటుంబానికి అండగా నిలబడాలనుకున్నా. చదువుకునే రోజుల్లో నుంచే విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశా. అప్పటి నుంచే స్వరాష్ట్ర సాధన నాలో తపన పెంచింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉన్నత చదువులు చదివి ఆవేదన పడుతున్న దృశ్యాలు కలిచివేశాయి. అప్పుడే తెలంగాణ సాధించుకోవాలి అనే తపన పెరిగింది. ఉద్యమమే ఊపిరిగా బతికా. 2007 నుంచే నా పోరాటం మొదలైంది. 2012లో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. రైల్‌రోకో, సకల జనుల సమ్మె, మిలియన్‌మార్చ్, అసెంబ్లీ ముట్టడి.. లాంటి నిరసన కార్యక్రమాల్లో  పాల్గొన్నా. ఆ సమయంలో నాపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కేసుల కారణంగా విదేశీ విద్యకు దూరం కావాల్సి వచ్చింది. 

జీవితాలు బాగుపడలె

ఉద్యమ పార్టీ అప్పటి టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేశా. ఆసమయంలో ఇప్పటి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్ నుంచి టికెట్ దక్కింది. అంతకుముందే ఆయన పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎన్నో విజయవంతం చేశాం. అయితే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా నాలాంటివారికి అన్యాయమే జరిగింది. చాలామంది పలుకుబడితో నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్నారు. కానీ నాలాంటివారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం చేశా. అయితే ఉద్యమం పాల్గొనడం వల్ల.. ఆ ఉద్యోగం కూడా చేజారింది. చాలా రోజుల తర్వాత అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం వచ్చింది. ఉద్యమకారులకు ఎవరికీ న్యాయం జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి సముచిత స్థానం కల్పించాలి. 

ఉద్యమకారులను గుర్తించాలి

నాలాంటివాళ్లు ఎంతోమంది ఉద్యమాలు చేశారు. అయినా ప్రభుత్వాలు గుర్తించడం లేదు. జూన్ 2న ఉద్యమకారులను ఆహ్వానించి ఒక్క దండ వేసి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీస గుర్తింపు ఉంటే భారం కొంతైనా తగ్గుతుంది. ఉద్యమకారులకు మంచి చేసేలా ప్రభుత్వం పక్కాగా చర్యలు తీసుకోవాల్సిన ఉంది. 

 సుదీప్‌రెడ్డి, ఉద్యమకారుడు