కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’. ఈ సినిమాకు హన్సల్ మెహతా దర్శకుడు. హన్సాల్, కరీనా కాంబోలో వస్తున్న తొలి చిత్రమిదే. కరీనా తన కెరీర్లో మొదటిసారి డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్న ఈ క్రైమ్ డ్రామాకు ఆమె కో-ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తోంది. ఈ చిత్రం ‘బీఎఫ్ఐేొలండన్ ఫిల్మ్ ఫెస్టివల్ భాగంగా గ్లోబల్ ప్రీమియర్‌లో ప్రదర్శితమై ప్రేక్షకుల ప్రశంసలందుకుంది. ‘2023 ముంబై ఫిల్మ్ ఫెస్టివల్’తోపాటు జియో మామి ఫెస్టివల్లోనూ ప్రదర్శితమై విమర్శకుల మెప్పు పొందింది.
2023లో నెట్‌ఫ్లిక్స్ నిర్వహించిన ది యాక్టర్స్ రౌండ్ టేబుల్ చర్చ సందర్భంగా కరీనా కపూర్ ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. ‘నేను డిటెక్టివ్‌గా నటించడం ఇదే మొదటిసారి. నేను క్రైమ్ డ్రామా అభిమానిని. దుఃఖమయంగా ఉండే ఈ పాత్రను పోషించడం చాలా కష్టతరమైనప్పటికీ, ఈ పాత్రలో నటించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇది నా కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగించే పాత్ర. నా ఉత్తమ పాత్రల్లో ఇదీ ఒకటి.
ఈ పాత్రను వదులుకోవడం ఇష్టం లేక దాన్ని నాలుగు భాగాల సిరీస్‌గా రూపొందించమని దర్శకుడిని కోరాను’ అని పేర్కొంది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 13న థియేటర్ల ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజాగా మంగళవారం టీజర్‌ను సైతం రిలీజ్ చేశారు. కరీనా కపూర్ పాత్ర తన బిడ్డను పోగొట్టుకుందని, దీంతో ఆమె డిటెక్టివ్‌గా మారినట్టు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.