భార్యాభర్తల బంధం శాశ్వతమైనది. అయితే సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత దంపతుల మధ్య ప్రేమ తగ్గడం, దూరం పెరగడం జరుగుతున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ధ్యాసంతా పిల్లలపైనే ఉండడం అందుకు కారణం. భార్యాభర్తలు తమ పిల్లలను ప్రేమగా చూసుకుంటూనే.. మునుపటిలా ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవాలని చెబుతున్నారు సైకాలజిస్టులు.
భార్యే ఇంటి పనులు, పిల్లల అవసరాలు చూసుకోవాలంటే అన్నిసార్లూ కుదరకపోవచ్చు. కాబట్టి ఇంటి పనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం లేదంటే ఒకరు ఇంటి పనులు చేసుకుంటుంటే.. మరొకరు చిన్నారులను ఎత్తుకోవడం, ఆడించడం వంటివి చేయాలి. ఇలా ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలి.
దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఇద్దరూ కలిసి ప్రేమగా మాట్లాడుకోవడం కూడా ముఖ్యమే. పిల్లలను చూసుకోవడానికి ఇంట్లో కుటుంబ సభ్యులెవరైనా ఉన్నట్లయితే కాసేపు పిల్లలను వారికి అప్పగించి.. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకురావడం, పిల్లలకు కావాల్సినవి కొనుక్కురావడం, అలా కాసేపు బయట గడపడం.. వంటివి చేస్తే ఇద్దరి మధ్య ప్రేమ, అర్థం చేసుకునే గుణం మరింతగా పెరుగుతుంది.