calender_icon.png 2 November, 2024 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఫ్గాన్ అదరహో

24-06-2024 01:52:02 AM

కింగ్స్‌టౌన్: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధించడం అలవరుచుకున్న అఫ్గానిస్థాన్.. పొట్టి ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదు చేసింది. టోర్నీ ఆరంభం నుంచి ఊహకందని ఫలితాలతో ఉత్కంఠగా సాగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ అద్భుత విజయం సాధించింది. సూపర్ గ్రూప్ భాగంగా ఆదివారం జరిగిన పోరులో అఫ్గానిస్థాన్ 21 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. ఈ గ్రూప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్ దాదాపు సెమీఫైనల్‌కు చేరిపోగా.. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ రెండేసి పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మొదట అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (60; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (51; 6 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించగా.. ఆ తర్వాత వచ్చినవాళ్లు భారీ షాట్లు ఆడలేకపోవడంతో అఫ్గాన్ ఊహించినదానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ వరల్డ్‌కప్‌లో రెండో హ్యాట్రిక్ నమోదు చేసుకోగా.. జాంపా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గుల్బదీన్ నైబ్ 4, నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీశారు. 

కమిన్స్ రికార్డు హ్యాట్రిక్

గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఆస్ట్రేలియా సారథి కమిన్స్.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాడు. 18వ ఓవర్ చివరి బంతికి రషీద్ ఖాన్‌ను ఔట్ చేసిన కమిన్స్.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ తొలి రెండు బంతులకు కరీమ్, నైబ్‌ను వెనక్కి పంపాడు. పొట్టి ప్రపంచకప్‌లో ఇది 8వ హ్యాట్రిక్ కాగా.. ఇందులో రెండుసార్లు ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు.