గయానా: ప్రతిష్ఠాత్మక పొట్టి ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్ పాకిస్థాన్‌పై అమెరికా సూపర్ విజయం మరవకముందే అఫ్గానిస్థాన్ టోర్నీ హాట్ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. గయానా వేదికగా గ్రూప్ శనివారం ఉదయం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 84 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
రహమనుల్లా గుర్బాజ్ (56 బంతుల్లో 80; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (41 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. అజ్మతుల్లా (13 బంతుల్లో 22) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, హెన్రీలు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫెర్గూసన్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 160 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ పిలిప్స్ (18 బంతుల్లో 18), మ్యాట్ హెన్రీ (17 బంతుల్లో 12) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
అఫ్గాన్ బౌలర్లలో ఫరూకీ, కెప్టెన్ రషీద్ ఖాన్‌లు చెరో 4 వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో రాణించిన గుర్బాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. పసికూన అనే ట్యాగ్‌ను ఇప్పటికే చెరిపేసుకున్న అఫ్గానిస్థాన్ కివీస్‌పై విజయంతో గ్రూప్ టాప్ స్థానంలో కొనసాగుతుంది.
బంగ్లాదే పైచేయి
డల్ల్లాస్: ప్రపంచకప్‌లో మరో పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. డల్లాస్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరకు బంగ్లానే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక (28 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధనుంజయ డిసిల్వా (21), అసలంక (19) పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొసెన్, ముస్తాఫిజుర్‌లు చెరో 3 వికెట్లు పడగొట్టారు.
తస్కిన్ అహ్మద్ 2, హసన్ షకీబ్ ఒక వికెట్ తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి విజయంతో టోర్నీలో శుభారంభం చేసింది. తౌహిద్ హ్రుదోయ్ (20 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించగా.. లిటన్ దాస్ (38 బంతుల్లో 36) రాణించాడు. ఆఖర్లో ఉత్కంఠ రేపినప్పటికీ సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా (16 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు.