11-04-2025 12:02:06 AM
అకాల వర్షం... అపార నష్టం
మామిడి, వరి, మొక్కజొన్న రైతు కుదేలు
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 10 ( విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం జిల్లాలో రైతులకు అపార నష్టం కలిగించింది. దీంతో మామిడి, వరి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెం లో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కోలుకో లేని దెబ్బ తీసింది. వర్షాలు ఈదురు గాలులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు.
అన్నపురెడ్డిపల్లి మండలంలోని అన్నిచోట్ల జల్లులు గాలి దుమారం పడుతుండటంతో కోతలు కోసి పంట ఆరబోసిన ధాన్యం అన్నదాతలకు వరుణ భయం పట్టింది. అకాల వర్షాలకు మామిడి అరటి బొప్పాయి మునగ మొక్కజొన్న పంటలు నేలరాలాయి. మరోవైపు ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్ద కావడంతో రైతులు ఆందోళన చెందారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవందనం చేయాలని వారు కోరుతున్నారు.
ఇప్పటికే పురుగు ఇతర తెగుళ్ల కారణంగా పెందెలు రాలిపోయి, మందులు కొట్టి కాపాడుకున్న మామిడికాయలు ఈ వర్షాలకు, ఈదురు గాలులకు నేలరాలి. మూడు రోజుల నుంచి ఆకాశం మెగావృతం కావడం, సాయంత్రం సమయంలో చిరుజల్లులు ఈదురు గాలులు వేచడంతో అరటి ,బొప్పాయి, మొక్కజొన్న తదితర పంటలు కొద్దిమేర నేలవాలయి. వరి సుంకు రాలిపోతుంది, కొన్నిచోట్ల పొగాకు, మొక్కజొన్న, వరి పంటలు ఆరబెట్టుకున్నారు. వరి కోతలు నిలిపి వేస్తున్నారు. చిరుజల్లులతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
ఈ ప్రాంతంలో సుమారు 127 ఎకరాల్లో మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. చేతికి అంది వచ్చిన పంట నేలపాలు కావడంతో అప్పుల మిగిలాయని రోదిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
వీరబోయిన అప్పారావు రైతు