నేడు తిలక్ జయంతి :
‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారవతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అం టూ తన కవితా లక్ష్యాన్ని తెలిపిన భావ, అభ్యుదయ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. 1928 ఆగస్టు 1న ఆంధ్ర ప్రదేశ్‌లోని తణుకు తాలూకా మండపాకలో జన్మించారు. సమాజంలోని అసమానతలపై వచన కవితల తో కొరడా ఝలిపించారు. ఆధునిక భావ కవితా ఉద్యమ ప్రభావంతో 1937లో ‘ప్రభాతము అనే పద్య కవితా సంకలనం వెలువరించారు. అభ్యుదయ సంఘ ప్రతినిధి అయ్యారు. దేవరకొండ తిలక్ భాష మెత్తనిది. భావం పదునైంది.
సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాల పట్ల అంత క్రోధం ఆయన కవిత్వంలో! స్త్రీలపై జరిగే దాడులు, అత్యాచారాలను ఖండిస్తూ ‘గజానికొక గాంధారి కొడుకు గాంధీగారి దేశంలో’ అని దుమ్మెత్తి పోశారు. తన సాహిత్యానికి సమాజంలోని బిచ్చగాళ్ళు, అనాధలు, పడుపు వృత్తిదారులు, దగాపడ్డ తమ్ముళ్లు, చీకటి బజారు వ్యాపారులు వంటివారినే ఆలంబనగా చేసుకున్నారు. కవిత్వాన్ని ఆయుధం గా చేసి అన్యాయాలపై గొంతెత్తిన మానవతావాది తిలక్. మానవ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అవినీతి, దోపిడీ మాఫీయాలపై గొంతెత్తారు.
గోరువంకలు, సుందరి సుబ్బారావు, సుశీల పెళ్లి, సాలె పురుగు వంటి రచనలతో అసమానతలను ఎలుగెత్తి చాటడం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. అటు అభ్యుదయ, ఇటు భావ కవిత్వాలతో గొప్పనైన సాహిత్యాన్ని వెలువరించిన మహా రచయిత, కవి తిలక్. ఆయన పేరు చెబితేనే గుర్తొచ్చే అద్భుత కవితా సంకలనం ‘అమృతం కురిసిన రాత్రి’. ఈ రచనకు 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. ‘సంకుచితమైన జాతి, మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు/ అంకుఠితమైన మానవీయ పతాకాన్ని ఎగురవేస్తు న్నాను చూడు/ చరిత్ర రక్త జలధికి, స్నేహ స్నేతువు నిర్మిస్తున్నాను రండి!’ అని యువతరానికి పిలుపునిచ్చారు. ఆనాడు దేశ స్వాతం త్య్రం కోసం లోకమాన్య తిలక్ ఎలాగైతే విదేశీయులపై తన ప్రకోపాన్ని చూపాడో, అదే విధంగా ఈ తిలక్ సాహిత్యంలో తనదైన పతాకాన్ని ఎగురవేశారు. 1966 జూలై 1న ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచివెళ్లారు.
ఐ.ప్రసాదరావు