- 52 ఏండ్ల వయసులో 150 కిలోమీటర్లు ఈతకొట్టిన స్విమ్మర్ శ్యామల
- విశాఖ నుంచి ఈదుకుంటూ కాకినాడకు చేరిక
- ఆసియాలోనే మొదటి స్విమ్మర్‌గా ఘనత
విశాఖపట్నం, జనవరి 4: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్విమ్మర్ శ్యామల అరుదైన ఘనత సాధించారు. 52 ఏండ్ల వయసులో వారం రోజుల పాటు అలుపెరగకుండా 150 కిలోమీటర్లు ఈతకొట్టి రికార్డు సాధించారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామల డిసెంబర్ 28న విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి ఈతను ప్రారంభించి, జనవరి 3న కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకున్నారు.
కేవలం వారంలోనే ఈ ఫీట్‌ను సాధించారు. ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన తొలి స్విమ్మర్‌గా శ్యామల రికార్డు సాధించారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ.. ఈ రికార్డు సాధించిన నాలుగో అంతర్జాతీయ స్విమ్మర్‌గా, తొలి భారతీయురాలిగా నిలిచినందుకు ఆనందంగా ఉందన్నారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని, ఇతర దేశాల స్విమ్మర్లు ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేయాలని ఆకాంక్షించారు.