calender_icon.png 20 October, 2024 | 2:11 PM

అడ్వాన్సులు ఫుల్

20-10-2024 02:29:59 AM

  1. ఉద్యోగులకు భారీగా లోన్లు, అడ్వాన్సులు
  2. గత ఏడాదికంటే ఆగస్టు నాటికి 50 శాతం అధికం 
  3. ఉద్యోగుల నుంచి సర్కారుకు భారీగా దరఖాస్తులు 

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సర్కారు వద్ద లోన్లు, అడ్వాన్సులు తెగ తీసేసుకొంటు న్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు, అధికారులకు ప్రభుత్వం ఇచ్చే లోన్లు, అడ్వాన్సులు భారీగా పెరిగాయి.

గత ఏడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే.. ఈసారి 50 శాతానికి పైగా రుణాలు, అడ్వాన్సులు పెరిగినట్లు కాగ్ నివేదిక చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు అడ్వాన్సులు, లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.19,626.32 కోట్లు  కేటాయించింది.

కాగ్ నివేదిక ప్రకారం ఆగస్టు నాటికే రూ.5,617.81 కోట్లను ప్రభుత్వం ఉద్యోగులకు అడ్వాన్సులు, లోన్ల రూపంలో చెల్లించింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 28.62 శాతం కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు నాటికి బడ్జెట్ అంచనాల్లో 14.14 శాతం మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి అడ్వాన్సులు 50 శాతానికి పైగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి.

ప్రభుత్వం రుణాలను ఎందుకు ఇస్తుంది?

వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం అడ్వాన్సులు, రుణాలను సర్కారు నుంచి తీసుకుంటారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని వాయిదా ప్రకారం.. వేతనాల నుంచి ప్రభుత్వం కట్ చేస్తుంది. ఇంట్లో శుభ కార్యాలు, వాహనాల కొనుగోలు, ఇంటి నిర్మాణం, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు.. ఇలా పలు అవసరాల కోసం ఉద్యోగులు ప్రభుత్వం నుంచి అడ్వాన్సులు కానీ, రుణాలను కానీ తీసుకుంటారు. వచ్చే జీతం ఆధారంగా సర్కారు ఆ నిధులను విడుదల చేస్తుంది.

దసరా, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ వేళ

సెప్టెంబర్, అక్టోబర్‌లో కూడా ప్రభుత్వం నుంచి ఉద్యోగులు రుణాలు, అడ్వాన్సులు రూపంలో భారీ మొత్తంలో తీసుకున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడం, దసరా, దీపావళి పండగలు ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖకు దరకాస్తులు భారీగా వచ్చినట్లు తెలుస్తోంది. ఓ ఉద్యోగి ఈ నెల 7వ తేదీన తన పెళ్లి కోసం దరఖాస్తు పెట్టుకోగా.. రూ.3 లక్షలు మంజూరయ్యాయి. మరో ఉద్యోగికి రూ.4 లక్షలను ప్రభుత్వం అడ్వాన్సు రూపంలో ఇచ్చింది.

అలాగే, ఇంకో ఉద్యోగి కారు లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. రూ.18 లక్షలను బీసీ సంక్షేమ శాఖ మంజూరు చేసింది. మరో ఉద్యోగికి ఈ నెల 18వ తేదీన కారు కోసం రూ.9 లక్షలను విడుదల చేసింది. అదే రోజున ఓ ఉద్యోగి పెళ్లికి అడ్వాన్సు కింద రూ.4 లక్షలను విడుదల చేసింది. సీజన్ కావడంతో ఈ రెండు నెలల్లో అడ్వాన్సులు, రుణాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2024-25లో ఉద్యోగులకు ఇచ్చిన లోన్లు, అడ్వాన్సులు..

నెల లోన్లు, అడ్వాన్సులు బడ్జెట్

(రూ.కోట్లలో) అంచనాల్లో శాతం

ఏప్రిల్ 150.10 0.76

మే 1,890.45 9.63

జూన్ 1,429.99 7.28

జూలై 1,152.94 5.87

ఆగస్టు 994.33 5.06

మొత్తం 5617.81 28.62