08-04-2025 07:06:58 PM
ప్రొఫెసర్ బ్రాండెన్ బర్గ్..
పటాన్ చెరు: ప్రపంచ ప్రఖ్యాత ఆడియో టెక్నాలజీ మార్గదర్శకుడు, బ్రాండెన్ బర్గ్ ల్యాబ్స్ జీఎంబీహెచ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, జర్మనీలోని ఇల్మెనావ్ టెక్నికల్ విశ్వవిద్యాలయ సీనియర్ ప్రొఫెసర్ కార్ల్ హీన్జ్ బ్రాండెన్ బర్గ్(Professor Karlheinz Brandenburg), ‘ఆడియో, అకౌస్టిక్స్కు సిగ్నల్ ప్రాసెసింగ్ యొక్క అనువర్తనాలు’ అనే అంశంపై హైదరాబాద్ లోని గీతం యూనివర్సిటీ(Gitam University)లో ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఆడియో రంగంలో చోటుచేసుకుంటున్న అధునాతన పరిజ్జానంపై లోతైన అవగాహన కల్పించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం (ఈఈసీఈ) మంగళవారం సిగ్నల్ ప్రాసెసింగ్, అంతర్జాతీయ కెరీర్ అభివృద్ధి రంగాల విశిష్ట వక్తలతో నిపుణుల ఉపన్యాసాల శ్రేణిని నిర్వహించింది.
ఆడియో కోడింగ్ పరిణామం, శ్రవణ అవగాహనలో పురోగతి, మ్యూజిక్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్(Music Information Retrieval), స్పేషియల్ ఆడియో, హెడ్ ఫోన్ ఆధారిత లిజనింగ్ టెక్నాలజీల వంటి ఉద్బవిస్తున్న ధోరణులను ప్రొఫెసర్ బ్రాండెన్ బర్గ్ వివరించారు. ఎంపీ3 ఫార్మాట్ కీలక ఆవిష్కర్తలలో ఒకరిగా పేరొందిన ప్రొఫెసర్ బ్రాండెన్ బర్గ్, ఓకియానోస్ ప్రో, పార్టీ (PARty) వంటి అత్యాధునిక సాంకేతికతలపై లోతైన అవగాహన కల్పించారు. లీనమయ్యే ఆడియో అనుభవాల భవిష్యత్తు పథం గురించి విహంగ వీక్షణం చేశారు. రూమ్ అకౌస్టిక్స్ ఇంటిగ్రేషన్, రెండరింగ్ టెక్నిక్ పురోగతి, వాటిని వ్యక్తిగతీకరించడం గురించి చెప్పారు. 2026 నాటికి క్యూ4లో ప్రారంభించే అవకాశం ఉన్న బిల్ట్-ఇన్ హెడ్-ట్రాకింగ్ సెన్సార్ లతో కూడిన కొత్త హెడ్ ఫోన్ ఉత్పత్తి కోసం ప్రణాళికలను కూడా ఆయన వెల్లడించారు.
ఆయనతో పాటు న్యూఢిల్లీలోని సెరాఫిమ్ కమ్యూనికేషన్స్ ఎల్ఎల్పీ వ్యవస్థాపకురాలు, ముఖ్య కార్యనిర్వహణాధికారి సునందరావు-ఎర్డెమ్(Sunanda Rao-Erdem), ‘జర్మనీలో వృత్తిపరమైన అవకాశాలు’ అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యువ ఇంజనీర్లకు ప్రపంచ కెరీర్ అవకాశాలను, ముఖ్యంగా జర్మన్ ఆవిష్కరణ, సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో అన్వేషించడానికి మార్గాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ చర్చలు ఆకర్షణీయమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ముగిశాయి. అతిథులిద్దరూ విద్యార్థుల ప్రశ్నలకు తగిన జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ చేపూరి అఖిలేష్, ఈఈసీఈ ప్రొఫెసర్ టి.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.