- వచ్చే విద్యాసంత్సరానికి ఇప్పటి నుంచే అడ్మిషన్లు
- అడ్వాన్సుల పేరుతో కార్పొరేట్ కాలేజీల దోపిడీ
- లేటయితే సీట్లు దొరకవని బెదిరింపు
- ఈ దోపిడీని అడ్డుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్
హైదరాబాద్, నవంబర్ ౨ (విజయక్రాంతి): ఈ విద్యాసంవత్సరం పూర్తికాక ముందే రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు వచ్చే ఏడాదికి సంబంధించి విద్యా వ్యాపారానికి తెరలేపాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలే అవుతోంది.
అప్పుడే 2025 విద్యాసంవత్స రానికి అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను కాలేజీల మేనేజ్‌మెంట్లు మభ్యపెట్టి, ఫీజులోని కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా కట్టించుకుని సీట్లను బుక్ చేస్తున్నాయి.
అడ్మిషన్ కోసం ముందే తొందరపడాలని తర్వాత సీట్లు దొరికే పరిస్థితి ఉండదని మాయమాటలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే చాలా సీట్లు బుక్ అయిపోయాయని భయపెట్టిస్తుండటంతో చేసేదిలేక తల్లిదండ్రులు రూ.10 అడ్వాన్సుల రూపంలో చెల్లిస్తున్నారు.
ఫస్టియర్ ఫీజే రూ.3 లక్షలు?
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ రాలేదు. 2024 విద్యాసంవత్సరమే ఇం కా పూర్తి కాలేదు. ఇటీవలే స్కూళ్లలో ఎస్‌ఏ పరీక్షలు నిర్వహించారు. ఇంకా కొన్ని పాఠశాలలు దీపావళి తర్వాత వీటిని నిర్వహించాలని భావిస్తున్నాయి. కానీ పేరుమోసిన కొన్ని కార్పొరేట్ కాలేజీలు అప్పుడే 2025 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడుతున్నాయి.
ఒక్కో కాలేజీ ఒక్కోలా ఫీజు వసూలు చేస్తోంది. కేవలం ఫస్టియర్ ఫీజునే లక్షన్నర నుంచి రూ.2.80 లక్షల వరకూ చెబుతున్నాయి. దోబీ వంటి ఇతర సేవలను సాకుగా చూపి మరో రూ.30 వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.
సెకండియర్ ఫీజును ఫస్టియర్ పూర్తయ్యాక మాట్లాడుకోవాల్సి ఉం టుందట. గ్రేటర్ హైదరాబాద్‌లోని కార్పొరేట్ కాలేజీల్లో ఈ దందా నడుస్తోంది. అడ్మి షన్ల కోసం హైదరాబాద్‌కు వస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీలు చెబుతున్న ఫీజు గురించి విని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నియంత్రణ లేకనే...!
సాధారణంగా పదో తరగతి పరీక్షలు ముగిసి, ఫలితాలు వెలువడిన తర్వాత ఇంటర్ బోర్డు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అప్పుడే ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఏటా ఇలా జరగడంలేదు. ప్రైవేట్ కాలేజీలపై నియంత్రణ లేకపోవడంతో మే, జూన్ నెలల్లో చేపట్టాల్సిన అడ్మిషన్ల ఇప్పటి నుంచే చేపడుతున్నాయి.
ఇప్పుడే అడ్మిషన్లు తీసుకుంటే రాయితీ ఇస్తామని చెప్తూ తల్లిదండ్రుల దగ్గర డబ్బు దండుకుంటున్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ చెల్లించకుంటే అడ్మిషన్లు దొరికే పరిస్థితి లేదని చెప్పటం వల్ల మంచి కాలేజీల్లో సీట్లు దొరకవేమోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు కార్పొరేట్ కాలేజీల అక్రమ వసూళ్లను అడ్డుకోవాలని ఇంటర్ బోర్డును కోరుతున్నారు. అడ్డగోలు ఫీజు దందాను అరికట్టి, ముందస్తు అడ్మిషన్లను చేపడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.