- జిల్లాలో విచ్చలవిడిగా కల్లు అమ్మకాలు
- రారాజులా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి..
- ఇష్టారీతిన మత్తు పదార్థాల వినియోగం
- రాజకీయ బలంతో ఫిర్యాదుదారులపై దాడులు!
- మామూళ్ల మత్తులో అధికారులంటూ ఆరోపణలు
“సాధారణంగా పల్లెల్లో పొద్దస్తమానం కష్టపడి పనిచేసిన కొందరు తమ అలసటను తీర్చుకునేందుకు కల్లు తాగుతుంటారు. గతంలో స్వచ్ఛమైన కల్లు లభించగా.. ప్రస్తుతం అంతటా కల్తీ కల్లు రాజ్యమేలుతోంది. దీనికి అలవాటుపడిన వారు మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారు.
ఫలితంగా చిన్న వయస్సుల్లోనే మోకాళ్లు, కీళ్ల నొప్పులు , బుద్ధిమాంద్యం, బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నా ఎక్సైజ్ శాఖ పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.”
వనపర్తి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ధనార్జనే ద్యేయంగా కృత్రిమ మత్తు పదార్థాలతో తయారు చేసిన కల్తీ కల్లును పేదలకు అంటగట్టి.. ఫలితంగా వచ్చిన అక్రమ సొమ్ముతో ఆయన ఓ రారాజులా వ్యవహరిస్తున్నాడు . దానికి తోడు ఈ మధ్యే సదరు రాజకీయ పార్టీ మరో విలువైన పదవిని అప్పజెప్పడంతో తనను ఎవరూ ఏం చేయలేరన్న ధోరణితో మరిన్ని కల్లు దుకాణాలను నడిపిస్తున్నాడు.
కల్లు తయారీలో ఇష్టారీతిన మత్తు పదార్థాన్ని వినియోగిస్తుండటంతో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కుటుంబపోషణను మరచిపోతున్నారు. ఫలితంగా కుటుంబ భార మంతా ఇంటి మహిళల పైనే పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లోని కల్లు దుకాణాల వద్ద గొడవలు జరిగినా పోలీసులు సైతం దుకాణ యజమానులకే వత్తాసు పలుకుతున్నారని ప్రజలు చెబుతున్నారు.
ప్రమాదకరమైన మత్తు పదార్థాలతో..
అల్ఫాజోళం, డైజోఫామ్, క్లోరో హైడ్రేట్ వంటి ప్రమాదకర మత్తు పదార్థాలతో కల్తీ కల్లును తయారు చేస్తున్నట్లు బాహాటంగా విమర్శలున్నాయి. గతంలో వ్యాపారులు డైజోఫామ్, క్లోరో హైడ్రేట్ వంటి పదార్థాలనే కల్లుకు ఉపయోగించేవారు. ప్రస్తుతం వీటి ధర పెరగటంతో అల్ఫాజోళాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.
కొద్దిపాటి చెట్టు కల్లులో నీళ్లు, మత్తుమందు కలిపి తీపి కోసం చెక్రీన్ పౌడర్, పులుపుకోసం ఈస్ట్ పౌడర్, నురుగు కోసం కొంత రసాలను కలుపుతున్నట్టు ప్రచారం. గతంలో నిర్వహించిన దాడుల్లో కల్తీ కల్లు ఆనవాళ్లను గుర్తించినా.. సదరు నేత అధికార బలానికి పోలీసులు తనిఖీలకు మం గళం పలికినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
కొరవడిన నిఘా..
జిల్లావ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, ఆలయాలకు సమీపంలో దుకాణాలు వెలుస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నార న్న ఆరోపణలున్నాయి. మహిళా సంఘాలు, సామాన్యులు ఫిర్యాదు చేస్తే వారిపైనే దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో కల్తీకల్లు విక్రయం జోరుగా సాగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవట్లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కల్తీ ముచ్చటే లేదు..
కల్తీ అనే ముచ్చటే లేదు. నిత్యం కల్లు దుకాణాలను తనిఖీ చేస్తున్నాం. ప్రతి రోజు తయారీ కేంద్రం నుంచి శ్యాంపిళ్లు కూడా సేకరిస్తున్నాం.
వెంకట్‌రెడ్డి, ఎక్సైజ్ సీఐ,
వనపర్తి సర్కిల్