calender_icon.png 21 September, 2024 | 8:16 AM

ప్రసాదంలో కల్తీ క్షమించరాని నేరం

21-09-2024 02:25:21 AM

  1. జంతువుల నూనెలు కలపడం హిందువులను మోసం చేయడమే
  2. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన అంతర్జాతీయ కుట్ర
  3. నేరస్థులను తొందరగా గుర్తించి కఠినంగా శిక్షించాలి
  4. జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి

హైదరాబాద్, సెప్టెంబర్ 20: తిరుమల లడ్డూలను నాణ్యత లేని పదార్థాలతో తయారవుతున్నాయన్న ఆరోపణలతో హిందువుల విశ్వాసాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఆలయంలో అవినీతి కూడా భారీ ఎత్తున జరిగిందని తెలిసి ఆందోళన చెందినట్లు తెలిపారు. ఈ చర్యలు హిందువులను కించపరిచే ఉద్దేశంతో జరిగిన కుట్రగా అభివర్ణించారు.

సమస్త హిందూ సమాజం పట్ల ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రగా అనిపిస్తోందని చెప్పారు. వచ్చిన ఆరోపణలన్నీ విచారణకు లోబడి ఉన్నాయని, రాజ్యాంగం, చట్ట ప్రకారం నేరస్థులకు కఠినంగా శిక్ష పడుతుందని ఆశిద్దామని స్వామీజీ పేర్కొన్నారు. సనాతన ధర్మంలోని అన్ని దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి పొందాలని అవిముక్తేశ్వరానంద సరస్వతి పేర్కొన్నారు. సెక్యులర్ ప్రభుత్వాల చేతుల్లో హిందూ దేవాలయాలపై ఉండకూడదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా హిందువులకు తమ దేవాలయాలపై నియంత్రణ లేదన్నారు. లౌకికత పేరిట హిందువుల దేవాలయాలపై అన్యమతస్థులకు అధికారాన్ని కల్పిస్తున్నారని చెప్పారు. కనీసం ఆచారాల నిర్వహణనైనా మతాచార్యులకు అప్పగించాలని సూచించారు.

చట్టపరంగా ముందుకెళతాం

తిరుమల లడ్డూల్లో పంది, గొడ్డు, చేప నూనెలు ఉన్న నెయ్యిని కలిపి హిందువులను మోసం చేశారని అవిముక్తేశ్వరానంద సరస్వతి మండిపడ్డారు. గోమాంసం తినిపించి ధర్మాన్ని కించపరిచడం అంతర్జాతీయ కుట్రలో భాగమని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది హిందువుల మత స్వాతంత్య్రంపై జరిగిన తీవ్రమైన దాడి అని, దీనికి అధికారుల సహకారం ఉందని ఆరోపించారు. ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాల శంకరాచార్యులు, పరస్పరం సలహా తీసుకుని మతరక్షణ కోసం చట్టపరంగా పోరాడుతామని వెల్లడించారు.

శృంగేరి, ద్వారకా శంకరాచార్యులతో కలిసి చట్ట నిపుణులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, త్వరలోనే ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. హిందువులపై జరిగిన ఈ భారీ కుట్రను బహిర్గతం చేసినందుకు, తిరుమలలో అవినీతిని ఆపినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ సమాజంపై జరిగిన ఈ ద్రోహానికి వ్యతిరేకంగా అందరం ఒక్కతాటిపై నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు. తెలియకుండా జంతువుల మాంసంతో తయారైన లడ్డూ తిన్నడం వల్ల ఎలాంటి అపవిత్రం జరగదని, అయినా ఇందుకు శాస్త్రోక్త పరిష్కారాన్ని వెతుకుతామని వెల్లడించారు

బద్రీనాథ్ ఆలయంలోనూ..

తిరుమల ఆలయం ప్రభుత్వ వ్యవస్థల చేతుల్లో చిక్కుకుని హిందూ వ్యతిరేక చర్యలకు కారణమైందని, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీలు అదే విధంగా ముందుకు సాగుతున్నాయని అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆరోపించారు. ఆది శంకరాచార్యులు నియమించిన డిమరి సంప్రదాయ కుటుంబాన్ని పక్కన పెట్టి కమిటీ భోగ ప్రసాదాలు తయారు చేయడం, పూజ నిర్వహణ కోసం బహిరంగ నియామకాన్ని ప్రారంభించిందని తెలిపారు. తిరుమల తరహాలో బద్రీనాథ్, కేదార్‌నాథ్ కమిటీలు వ్యవహరించవద్దని కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.