- తిమ్మాపూర్‌లో అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్న విద్యార్థులు
- ఆందోళనతో ఇంటికి తీసుకెళ్తున్న తల్లిదండ్రులు
- బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ చర్యలు?
మానకొండూర్, నవంబరు 12 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల రామకృష్ణ కాలనీలో గల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా బయటకు పొక్కకుండా పాఠశాల ప్రిన్సిపాల్ జాగ్రత్త పడినట్టు తెలుస్తున్నది.
మంగళవారం విజయక్రాంతి గురుకులాన్ని సందర్శించగా ఈ విషయం బయటపడింది. గురుకులంలో ఎన్నో రోజులుగా నాసిరకం ఆహారం పెడుతుండటంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. కొంతమంది విద్యార్థులకు ఆహారం పడక కడుపు నొప్పితో ఆసుపత్రి పాలవుతున్నారు.
తమ పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులను పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ అనుమతించడం లేదని తెలుస్తున్నది. ఎట్టకేలకు పాఠశాల టీచర్లతో గొడవపడి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్నారు.
530 మందిలో 130 మంది ఇళ్లకు
ఈ పాఠశాలలో మొత్తం 530 మంది విద్యార్థులు ఉండగా 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుత సీజన్‌లో వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో చతువుకోలేక నాణ్యమైన భోజనం జీర్ణంకాక కడుపు నొప్పితో విద్యకు దూరమవుతున్నారు.
గత ఐదు రోజులుగా బియ్యం ఉడకక జీర్ణం కాకపోవడంతో ఫుడ్ ఫాయిజన్ అయి కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విజయక్రాంతి ప్రతినిధితో చెప్పారు. అది గమనించిన పాఠశాల సిబ్బంది పిల్లలను డైనింగ్ హాల్‌లోకి తీసుకెళ్లి గేటు వేశారు. అంతేకాకుండా విలేకరుల పట్ల ప్రిన్సిపాల్ వెంకటరమణ దురుసుగా, నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడంపై పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీర్ణంకాక ఆసుపత్రుల్లో చేరుతున్నారు
విద్యార్థులకు సివిల్ సప్లు సరఫరా చేసిన బియ్యం ఉడకపోవడంతో పిల్లలు తినడం వల్ల జీర్ణం కావడం లేదు. దీంతో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు. ఆహార సమస్య కాకుండా పాఠశాలలో చాలా సమస్యలు ఉన్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించలేక పోతు న్నాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి బడ్జెట్ కేటాయించక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
ప్రిన్సిపాల్ వెంకటరమణ