calender_icon.png 16 January, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలను దత్తత తీసుకోండి

08-08-2024 01:17:40 AM

  1. అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులివ్వండి
  2. కార్పొరేట్ కంపెనీలకు మంత్రి సీతక్క విజ్ఞప్తి
  3. కంపెనీలు సంసిద్ధత వ్యక్తం 

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ కంపెనీలు తమవంతు సహకారం అందించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. వారి అభివృద్ధి కోసం సామాజిక బాధ్యతగా కంపెనీలు ముందుకు రావాలని కోరారు. ఒక్కో కార్పొరేట్ కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సెర్ప్ సీఈ వో దివ్యా దేవరాజన్, ములుగు కలెక్టర్ దివాకర్‌తో కలిసి దిగ్గజ ఐటీ కంపెనీలైన మైక్రో సాఫ్ట్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్వాల్కమ్, బోష్, గ్రాన్యూల్స్ ఇండియా, టీసీఎస్, ఉషా, నిర్మాణ్ కంపెనీల ప్రతినిధులు మంత్రితో బుధవారం భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మనతోపాటు చుట్టూ ఉన్న వాళ్లు సంతోషంగా ఉండాలన్న లక్ష్యం తో కార్పొరేట్లు పనిచేస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని సమస్యలను పరిష్కరించడంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగు  పరిచేలా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.

ఆదిలాబాద్, ములుగు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని మార్పు చేసి చూపించాయని స్పష్టంచేశారు. ప్రజలకు సహాయం చేస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పారు. ప్రజాసేవలో సంతృప్తి పొందిన వారే అసలైన శ్రీమంతులని పేర్కొన్నారు. మంత్రి పిలుపుమేరకు ములుగు వంటి నియోజకవర్గాల్లో సీఎస్‌ఆర్ నిధులను వెచ్చించేందుకు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు కంపెనీలు ముందు కువచ్చాయి. ఆయా కంపెనీలను మంత్రి సీతక్క అభినందించారు.