హైకోర్టుకు తెలిపిన బార్ కౌన్సిల్
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): తెలంగాణలోని లా కాలేజీలకు అనుమతులు, గుర్తింపు ప్రక్రియను ఆగస్టు 4లోగా పూర్తి చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం హైకోర్టుకు నివేదించింది. అదేవిధంగా ఆగస్టు 5 నుంచి ఎల్‌ఎల్బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల అడ్మిషన్లకు కౌన్సిలింగ్‌కు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం తెలిపింది. 2023 అడ్మిషన్లలో యుజీసీ నిబంధనలను ఉల్లంఘించడాన్ని న్యాయవాది ఏ భాస్కర్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ లా కాలేజీల అనుమతులు, గుర్తింపులను ఆగస్టు 4లోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కౌన్సిలింగ్ ఆగస్టు 5 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ హైకోర్టు దష్టికి తీసుకువచ్చారు. అమికస్క్యూరీ సీనియర్ న్యాయవాది పీ శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ లా కాలేజీల ఏర్పాటులో సుదీర్ఘ ప్రక్రియతో జాప్యం జరుగుతోందన్నారు. కాలేజీలు కూడా ప్రతి ఏటా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుండటంతో అడ్మిషన్లలో జాప్యం జరుగుతోందన్నారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూ ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయిలో వాదనలు విని వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ చేయాలనుకుంటున్నామని తెలిపింది. ప్రస్తుత అడ్మిషన్లకు సంబంధించి వివరాల నిమిత్తం తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.