- మిగతా కాలేజీల్లో లా అడ్మిషన్లకు అనుమతి
- హైకోర్టుకు తెలిపిన బీసీఐ
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాం తి): లా డిగ్రీ ప్రవేశాల్లో వివాదాలకు సంబంధించి రెండు కాలేజీల్లో మినహా మిగిలిన వాటిల్లో అడ్మిషన్లకు అనుమతించినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) సోమవారం హైకోర్టుకు తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా లేని వరంగల్ వర్సిటీ కాలేజీ ఆఫ్ లా, కూకట్‌పల్లిలోని అనంత లా కాలేజీల్లో ప్రవేశాలను నిలిపివేసినట్లు తెలిపింది. యూజీసీ నిబంధనల ప్రకారం న్యాయశాస్త్ర కోర్సుల్లో సకాలంలో అడ్మిషన్లు క్రమబద్ధీకరించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యా యవాది ఏ భాస్కర్‌రెడ్డి పిల్ దాఖలు చేసిన విషయం విదితమే.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. బీసీఐ తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ వాదన లు వినిపిస్తూ గత ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిపారు. అన్ని కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతించామని, రెండు కాలేజీల్లో నిలిపివేసినట్లు తెలిపారు. కాలేజీల్లోని వసతులపై బీసీఐ కమిటీ తనిఖీలు నిర్వహించిందని చెప్పారు.
దీనికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పించినట్లు వెల్లడించారు. నల్సార్ వర్సిటీతోపాటు పలు కాలేజీలు, వర్సిటీలు తనిఖీల ఫీజు, హామీ ఫీజులు చెల్లించాల్సి ఉందని వివరించారు. నల్సార్ వర్సిటీ రూ.18.5 లక్షల దాకా చెల్లించాల్సి ఉందని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం బీసీఐకి నల్సార్ బకాయి ఉందన్న వివాదంపై ఆ వర్సిటీకి ఛాన్సలర్‌గా ఉన్న తాను విచారించలేనంటూ మరో ధర్మాసనానికి కేసును బదిలీ చేశారు. ఈ వివాదంపై జస్టిస్ సుజయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతుందని తెలిపారు.