calender_icon.png 28 September, 2024 | 4:56 AM

అడ్మిషన్ ఒకచోట.. తరగతులు మరోచోట!

28-09-2024 02:33:20 AM

  1. అకాడమీల పేర్లతో ఇంటర్ తరగతులు 
  2. ప్రైవేట్ విద్యాసంస్థల నయా దందా
  3. పట్టించుకోని ఇంటర్ బోర్డు 

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): బయట ఉండే బోర్డు ఒకటి.. లోపల జరిగేది మాత్రం ఇంకొకటి. అడ్మిషన్ ఉండే ది ఒక చోట.. విద్యార్థులు తరగతులు వినేది మరోచోట.. ఇది రాష్ట్రంలోని పలు అకాడమీలు, కార్పొరేట్ ఇంటర్ కాలేజీల తీరు. కొన్ని అకాడమీలు నిబంధనలలోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకొని విద్యను వ్యాపారం  చేస్తున్నాయి.

కొన్ని సంస్థలు అకాడమీ పేర్లతో ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఐఐటీ, ఎంబీ బీఎస్, ఇంజినీరింగ్‌లలో అడ్మిషన్ల కోసం కోచింగ్ ఇస్తున్నట్లు ప్రకటించి లోపల మాత్రం గుట్టుగా ఇంటర్ తరగతులను కొనసాగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. నిబం ధనలకు విరుద్ధంగా నడిచే ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకుండా ఇంటర్ బోర్డు అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గల్లీకొకటి అన్నట్లు రాష్ట్రం లో అకాడమీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. విద్యను కార్పొరేట్ మయం చేస్తు న్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంటర్ బోర్డు నుంచి అనుమతులు తీసుకోకుండానే అకాడమీ పేరుతో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఎంట్రెన్స్‌లకు కోచింగ్ ఇస్తామని చెబుతూ ఇంటర్ తరగతులను నడుపుతున్నాయి.

ఇందుకు విద్యా ర్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఓ ఇంటర్ కాలేజీకు అనుమతులు తీసుకోవాలంటే ఫైర్ సేఫ్టీ, ఫ్యాకల్టీ తదితర నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ సరైన వసతులు, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా రహస్యంగా అపార్ట్‌మెంట్స్‌లో తరగతులు నడుపుతున్నారు.

సరైన వసతులు కల్పించకుండా డే స్కాలర్ కోసం ఒక ఫీజు, హస్టల్స్ అయితే మరో ఫీజు వసూలు చేస్తున్నారు. రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఏడాదికి ఫీజు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఉదయం, సాయంత్రం వేళల్లోనే నడవాలి..

ఇంటర్ బోర్డు నుంచి అనుమతులు తీసుకోకుండా గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్స్‌లో  అకాడమీలను నడుపుతూ కోట్లు సంపాదిస్తున్నారు. కనీసం సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. వారి అకాడమీలోనే పుస్తకాలు కోనుగోలు చేయాలని నిబంధనలు పెట్టి అక్రమంగా దోచుకుంటున్నారు. అకాడమీలు అంటే ఉదయం, సాయంత్రం మాత్రమే ట్యూషన్ చెప్పాలి.

కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా తరగతులు నిర్వహిస్తున్నారు. తమ వద్ద చేరితే మంచి ర్యాంకులు వస్తాయంటూ పేపర్ ప్రకటనలిచ్చి విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక మార్కెటింగ్ బృందాలు, పీఆర్‌ఓ వ్యవస్థలను పెట్టుకుంటున్నాయి. ఇన్ని చేస్తున్న ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్‌లోనే ఎక్కువ..

అకాడమీలు ఎక్కువగా హైదరాబాద్ మహానగరంలోనే ఉన్నాయి. ఆ తర్వాత ప్రధాన నగరాలైన వరంగల్, ఖమ్మంతో పాటు ఇతర కొన్ని పెద్ద పట్టణాల్లోనూ పుట్టుకొస్తున్నాయి. సుమారు 500 వరకు అకాడమీలు ఉన్నట్లు సమాచారం. మైక్లాస్, విట్‌జీ, దీక్షా, నైన్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్ వాలా, శ్రీ చైతన్య ఎడ్యుకేషన్, నారాయణ అకాడమీ తదితర పేర్లతో రాష్ట్రంలో అకాడమీలు నడుస్తున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

విద్యార్థులు క్లాసులు వినేది అకాడమీలో కానీ, అడ్మిషన్, సర్టిఫికెట్లు ఇచ్చేవి వేరే కాలేజీలు. వీరితో అకాడమీలు ఒప్పందాలు చేసుకుంటాయని తెలుస్తోంది. ఇవే కాకుండా కొన్ని కార్పొరేట్ కాలేజీలు కూడా విద్యార్థులకు ఒక బ్రాంచీలు అడ్మిషన్లు ఇచ్చి.. మరోచోట క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం తెలియక అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. 

నియంత్రణ కరువు..

కోచింగ్ పేర్లతో ఏటా వందల్లో అకాడమీలు వెలుస్తున్నాయి. వీటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండటం లేదు. ఏటా వేల కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. కోచింగ్ సెంటర్ల కట్టడికి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. వీటి కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

ఇంటర్ బోర్డు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అడ్డగోలు ఫీజులు వసూలు చేయకుండా ఓ నిర్ధిష్టమైన ఫీజు విధానాన్ని తీసుకురావాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ నాగరాజు, టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హరీశ్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.