ఈమధ్య జరుగుతున్న అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీక్ కావడం, రాజకీయ నేతలు ఆ పోటీ పరీక్షలను వాయిదా వేయాలనడం, కోర్టుల్లో కేసులు వేయడం తరచూ జరుగుతున్న వ్యవహారం. దీనిపై పేపర్లనిండా వార్తలు, టీవీల్లో డిబేట్స్, చివరికి ఏదో ఒక కమిషన్ వేసి చేతులు దులుపుకోవడం పాలకులకు, రాజకీయ నేతలకు సరదాగా ఉంటుందేమో గానీ, రాసిన పరీక్షలు ఏమవు తాయో అన్న గందరగోళంలో బుర్ర పాడుచేసుకోవడం యువతకు తప్పడం లేదు. విషయాలన్నీ లోతుగా పరిశీలిస్తే ఇందులో ఎవరికీ పరీక్షల నిర్వహణపట్ల గానీ, పరీక్షల ఫలితాలపట్ల గానీ, యువతకు న్యాయం చేయాలనే విషయంలో గానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ రావణకాష్టంలో విద్యార్థు లు, నిరుద్యోగ యువత సమిధలు అవుతున్నారనే నిజాన్ని అన్ని రాజకీయ పక్షాలు గ్రహించాల్సిన అవసరం వుంది.
నీట్ నుంచి టెన్త్ దాకా...
ఇటీవల దేశం మొత్తం మీద 24 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారంలో దేశం మొత్తం అట్టుడికి పోయింది. చివరికి పరీక్ష రద్దయింది. సీబీఐ విచారణకు ఆదేశించారు. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థితో పాటుగా తల్లిదండ్రులూ బాధ పడుతున్నారు. యూపీలో జరిగిన పోలీస్ రిక్రూట్‌మెంట్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన టీచర్స్ రిక్రూట్‌మెంట్, బీహార్‌లో జరిగిన రైల్వే నియామకాలు.. ఇలా అన్ని పరీక్షల పేపర్లు లీక్ అవుతూనే వున్నాయి. ఇవే కావు. చివరికి, విద్యార్థుల వార్షిక పరీక్షలు, పదవ తరగతి, ఇంటర్ మీడియట్, సీబీఎస్సీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పేపర్లతోపాటు వివిధ ఏజన్సీలు నిర్వహించే బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమీషన్, రైల్వే ఇంకా అనేక శాఖలు నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల పేపర్లుకూడా లీక్ అవుతూనే వున్నాయి. బెంగాల్‌లో విద్యార్థుల కు జరుగుతున్న లైఫ్ సైన్సెస్ పరీక్ష పేపర్ వాట్పాప్ లో చక్కర్లు కొట్టింది. అక్కడ విద్యార్థులకు జరుగుతున్న వార్షిక పరీక్షల్లో ప్రతిరోజు ప్రతి పేపర్ లీకు కావడం, ఇందుకు ప్రభుత్వం ఏవో కుంటి సాకులు చెప్పడం మామూలైంది.
లక్షలాది మంది రాసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలు ఒక వ్యక్తి ఏకంగా పెన్ డ్రైవ్‌లోనే వేసుకుని తనకు ఇష్టమైన వారికి పంచాడు. వీళ్ళు లక్షల్లో ఇతరులకు అమ్మారు. చాలామంది ఆ పరీక్షలు రాసి పాసయ్యారు. ఉద్యోగాలు కూడా సంపాదించారు. కాలం కలిసిరాక అతను పట్టుబడ్డాడు. అప్పుడు మిగతా పరీక్షలు రద్దు అయ్యాయి. పక్కా ప్రణాళికతో రాత్రింబవళ్లు కష్టపడి చదువుకున్న వారు మాత్రం దురదృష్టవంతులయ్యా రు. పరీక్ష పేపర్ లీక్ చేసి అమ్ముకుంటే డబ్బులు వస్తాయనే తుచ్ఛమైన ఆలోచనతో చేస్తున్న ఈ రాకెట్ వెనుక కొంతమంది ఉంటారు. ఇలాంటి క్రిమినల్స్‌ను కోర్టులు క్షమించకుండా శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. వీటిని అరికట్టడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినా ఎవరికీ శిక్షలు పడిన దాఖలాలు లేవు. పేపర్ లీకేజీలు దేశానికే ప్రమాదకరం. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లకు సంబంధించిన పేపర్లు కూడా లీకయితే ఆ పరీక్షలు రాసినవారు రేపు ఎలాంటి సేవలను ప్రజలకు అందిస్తారో ఊహించవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ పేపర్‌లో జరిగిన అవకతవకలతో రెండేళ్ల విలువైన సమయాన్ని నిరుద్యోగ యువత కోల్పోయింది. ప్రభుత్వం మారింది. అధికారులు మారారు. పరీక్షలు మొదలయ్యాయి. మళ్ళీ పరీక్షలు తేదీలను మార్చాలని ఒకరు, ఎక్కువమందిని తీసుకోవా లని మరొకరు.. ఇలా రాజకీయ నేతలు స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. చివరికి పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ఉద్యోగాల నియామకాలు అన్నీ రాజకీయ నేతల చేతుల్లోకి వెళుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పరీక్షలు జరిగి నియామక పత్రాలు అందుకుని ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆ నియామకాలు చెల్లవనే తీర్పులు కూడా వచ్చాయి.
ఎప్పుడో ఆరేళ్ళకింద జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగిన నియామకాలు చెల్లవని ఇచ్చిన కోర్టుల తీర్పుపై అభ్యర్థ్ధులు మళ్ళీ పిటిషన్ వేసిన సంఘటలు వున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఏకంగా 25 వేలమంది టీచర్ల నియామకాలను కోర్టు తప్పు పట్టింది. వారు మళ్ళీ కోర్టు మెట్లెక్కారు. ఈ విధంగా దేశంలో జరుగుతున్న అన్ని పరీక్షల నిర్వహణ రోజురోజుకు అప్రతిష్ఠ పాలవుతోంది. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు అవసరం. నిజాయితీకి, క్రమశిక్షణకు స్థానం ఉన్నపుడే సమర్థులైన ఉద్యోగులు ప్రజల్లోకి వస్తారు. ప్రజలకు మంచి సేవలు చేయగలుగుతారు. పరీక్షల నిర్వహణలో రాజకీయా లకు ప్రవేశం నిషేధించాలి. దేశంలో జరిగే అన్ని పరీక్షలకు మరింత సమర్థతగల ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థ ఉండాలి. ఇందుకోసం పార్లమెంట్ ద్వారా చట్టాన్ని తీసుకొని రావాలి. అప్పుడే పరిస్థితులు ఏమైనా మారవచ్చు.
కన్నోజు మనోహరా చారి