calender_icon.png 21 September, 2024 | 5:59 AM

బడుల్లో టీచర్ల సర్దుబాటు!

21-09-2024 02:56:21 AM

  1. విద్యార్థుల రేషియో ఆధారంగా టీచర్లు 
  2. ఎక్కువ ఉన్న చోటు నుంచి తక్కువ ఉన్న చోటుకు 
  3. మార్గదర్శకాలు జారీ చేసిన విద్యాశాఖ 
  4. ఈనెల 23 వరకు పూర్తి చేయాలి 
  5. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయుల కొరత వెంటాడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. టీచర్ల కొతర ఉన్న పాఠశాలల్లో వెంటనే మిగులు టీచర్లను సర్దుబాటు చేసేలా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా జిల్లా కలెక్టర్లు స్థానిక అవసరాలకు అనుగుణంగా టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలోని పేద వర్గాల పిల్లలు చదివే పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది పడిపోతోంది. దీనికి అనేక కారణాలతోపాటు స్కూళ్లలో సరిపడా టీచర్లు లేకపోవడం కూడా ఒక కారణంగా అధికారులు గర్తించారు. 

 17 మందికి ఒక టీచర్.. 

సాధారణంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం 1:30 ఉండాలి. అంటే 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ ప్రస్తుతం దీనికంటే మెరుగ్గానే 1:17 నిష్పత్తిలో ఉన్నప్పటికీ చాలా వరకు స్కూళ్లలో ఇంకా టీచర్ల కొరత తీవ్రంగా వెంటాడుతోంది. టీచర్లు లేకపోవడంతో విద్యార్థులను బడుల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీచర్లను సర్దుబాటు చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు.

ఎక్కువ ఉన్న చోటు నుంచి తక్కువ ఉన్న చోటుకి..

అయితే కొన్ని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య కంటే కూడా టీచర్లే ఎక్కువగా ఉంటున్నారు. మరికొన్ని స్కూళ్లలో టీచర్లు తక్కువ ఉంటే విద్యార్థులు ఎక్కువ మంది ఉంటున్నారు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన అధికారులు టీచర్లను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. మిగులు టీచర్లను టీచర్లు లేని పాఠశాలలకు పంపించనున్నారు. ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు టీచర్ల సర్దుబాటు చేపడుతున్నారు. టీచర్లు సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలకు మిగులు టీచర్లను వర్క్ అడ్జెస్ట్‌మెంట్ పేరుతో సర్దుబాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్లు స్థానికంగా నిర్ణయం తీసుకొని ఈనెల 23లోపు సర్దుబాటు చేసి పూర్తి రిపోర్టు పంపాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

* 200 మంది కంటే ఎక్కువ విద్యార్థులుంటే ప్రతీ 40 మంది విద్యార్థులకు ఒకరు అదనంగా టీచర్ ఉండాలి.

* అప్పర్ ప్రైమరీ సెక్షన్లు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో (6 నుంచి 8) 1 మంది విద్యార్థులుంటే ఒకరు లాంగ్వేజ్ టీచర్, మరొకరు నాన్ లాంగ్వేజ్ టీచర్ ఉండాలి.

* 21 మందికి పైగా విద్యార్థులుంటే నలుగురు సబ్జెక్ట్ టీచర్లు ఉండాలి.

ఉన్నత పాఠశాలల్లో ఇలా...

ఒకే గ్రామపంచాయతీ పరిధిలో మిగులు టీచర్లను నిబంధనల మేరకు సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకే ప్రాంగణంలో రెండు ప్రైమరీ స్కూళ్లు ఉంటే వాటిని ఒకే స్కూల్ కింద పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి స్థానిక అవసరాలను బట్టి సర్దుబాటు చేసుకోవాలి. ఇలా చేసినా గాని టీచర్ల కొరత ఉంటే ఇతర స్కూళ్ల నుంచి సర్దుబాటు చేసుకోవాలి. రెండు ప్రాథమికోన్నత పాఠశాలలు లేదా ఒకటి ప్రాథమిక పాఠశాల, మరొకటి ప్రాథమికోన్నత పాఠశాలు ఒకే ప్రాంగణంలో ఉంటే వాటిని ఒకే యూనిట్‌గా పరిగణించాలని మార్గదర్శకాల్లో తెలిపారు. అక్కడున్న టీచర్ల సంఖ్యను బట్టి సర్దుబాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఒకే ప్రాంగణంలో రెండు ఉన్నత పాఠశాలలున్నా ఇదే విధమైన నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.

ప్రైమరీ, యూపీఎస్ పాఠశాలల్లో ఉండాల్సిన టీచర్ల వివరాలు..

విద్యార్థుల ఉండాల్సిన 

సంఖ్య టీచర్లు

1-10 ఒక టీచర్

11-60 ఇద్దరు టీచర్లు

61-90 మూడు టీచర్లు

91-120 నలుగురు టీచర్లు

121-105 ఐగురు టీచర్లు

153-200 ఆరుగురు టీచర్లు