calender_icon.png 23 November, 2024 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్సిటీల్లో ప్రొఫెసర్ల సర్దుబాటు!

23-11-2024 01:20:02 AM

  1. ఆదరణ లేని కోర్సుల గుర్తింపు
  2. ప్రత్యేక శిక్షణతో ఇతర కోర్సులకు ఫ్యాకల్టీ మార్పు బకసరత్తు చేపట్టిన ఉన్నత విద్యామండలి

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి) : యూనివర్సిటీల అభివృద్ధిపై తెలం గాణ ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే వర్సిటీల్లో ప్రొఫెసర్లను సర్దుబాటు చేయాలని భావిస్తోంది. కొన్ని దశాబ్దాల కిందట ప్రవేశపెట్టిన పలు ఆదరణలేని కోర్సుల్లో విద్యార్థులు చేరడంలేదు.

కొన్ని కోర్సుల్లో అడ్మిషన్లు సున్నా ఉండగా.. మరికొన్ని కోర్సులకు పది మందిలోపే ప్రవేశాలు పొందుతున్నారు. కానీ, స్టాఫ్ మాత్రం పూర్తిస్థాయిలో ఉంటున్నారు. ప్రవేశాల అంశం అధికారుల దృష్టికి రావడంతో సంబంధిత కోర్సులను బోధించే ఫ్యాకల్టీని వేరే కోర్సులకు సర్దుబాటు చేయాలని విద్యామండలి భావిస్తోంది.

ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ, మెళకువలు నేర్పి సేవలను వినియోగించుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఆ కోర్సుల్లో విద్యార్థులెవరైనా ఉంటే వారిని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో పీజీ కోర్సులు అందించే వాటిలో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ, మహిళా యూనివర్సిటీలు ప్రధానమైనవి.

ఫ్యాకల్టీ షిఫ్టింగ్ విధానాన్ని మాత్రం జేఎన్టీయూ, మహిళా వర్సిటీలు మినహా మిగతా వాటిలో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ వర్సిటీల్లో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ద్వారా వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంఎస్‌డబ్ల్యూలలో దాదాపు 50 కోర్సులున్నాయి.

అయితే కొన్ని కోర్సులకు ఆదరణ కరువై అడ్మిషన్లు రావడంలేదు. దీంతో ఫ్యాకల్టీ సైతం విధులకు హాజరుకావడంలేదని అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో వర్సిటీల వారీగా అడ్మిషన్లు తక్కువగా ఉన్న కోర్సుల వివరాలను ఉన్నత విద్యామండలి సేకరిస్తోంది. అధ్యాపకుల విద్యార్హతలను బట్టి ప్రత్యేక శిక్షణతో వారిని ఇతర కోర్సులకు సర్దుబాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

అలాగే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే కోర్సుల రూపకల్పనపై కూడా మండలి దృష్టి సారించింది. చేసి డిగ్రీ పట్టా అందుకొని బయటికి వచ్చిన వెంటనే మంచి ఉద్యోగాలు లభించేలా ఉపాధి కోర్సులను రూపొందిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు.