calender_icon.png 5 October, 2024 | 6:52 AM

గ్రూప్1పై తీర్పు వాయిదా

05-10-2024 02:27:57 AM

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): గ్రూప్- పరీక్షపై దాఖలైన పిటిషన్లలో ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ శుక్రవారం ప్రకటించారు. గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలోని తప్పుల్ని సరిచేయలేదంటూ పలువురు అభ్యర్థులు రెండు వేరువేరు వ్యాజ్యాలు వేశారు.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదిస్తూ, పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవతకవకలు జరగలేదని తెలిపారు. కీలో జరిగిన పొరపాట్లను సరిచేశారని చెప్పారు. రెండు ప్రశ్నలకు మాత్రమే జవాబులు తప్పుగా రావడంతో నిపుణుల కమిటీ సిఫారసులకు మేరకు వాటిని తొలగించారని వెల్లడించారు.

ఇప్పటికే పరీక్షల నిర్వహణలో జాప్యం జరిగి అభ్యర్థులు నష్టపోయారని, మరోసారి నిరుద్యోగులు నష్టపోయేలా ఉండకూడదని తెలిపారు. పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలను పిటిషనర్ల అడ్వొకేట్లు వ్యతిరేకించారు. ఏడు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని తెలిపారు.

ఆ ఏడు ప్రశ్నలను తొలగించి, అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి మెయిన్స్ నిర్వహించాలని కోరారు. సమాధానాలకు దేన్ని ప్రామాణికంగా తీసుకునే అంశంపై స్పష్టత కమిషన్‌కే లేదని అన్నారు. గత పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగడంతో వాటిని ఇదే హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.