ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. కేటీఆర్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
తీర్పు వెలువడే దాకా కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు
- సొమ్ము ఎక్కడికి చేరింది?
- ఎవరికి చేరింది? తేల్చాలి
- గుంపగుత్తగా చట్టాల ఉల్లంఘన
- దర్యాప్తు దశలో అడ్డుకోవద్దు: ఏజీ
* బ్యాంక్ గ్యారెంటీ సమర్పించారా, దాన్ని నగదుగా మార్చారా లేదా? ఏసీబీ కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది? ఎంత మంది సాక్షుల స్టేట్మెంట్స్ రికార్డు చేశారు?
హైకోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): ఫార్ములా ఈ- కార్ రేసు అక్రమాలపై ఏసీబీ నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం వాదప్రతివాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ వెల్లడించారు.
తీర్పు వెలువడే వరకు పిటిషనర్ కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని ఏసీబీని ఆదే శించారు. గతం లో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లోని నిబంధనలన్నీ అమల్లో ఉం టాయన్నారు. ఏసీబీ దర్యాప్తును కొనసాగించవచ్చునని, దర్యాప్తునకు కేటీఆర్ సహకరించాలని, తన వద్ద ఉన్న పత్రాలను ఏసీబీకి కేటీఆర్ అందజేయాలని ఆదేశిస్తూ.. గత మధ్యంత ర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
అగ్రిమెంట్‌కు ముందే చెల్లింపులు: ఏజీ
ఫార్ములా ఈ-కార్ రేస్‌కు సంబంధించి 2023లో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందే చెల్లింపులు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డ్డి చెప్పారు. ఒప్పందాలు జరుగుతాయని ఊహించి చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. అవినీతి జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు.
మొదటి అగ్రిమెంట్ 2022 అక్టోబర్ 15న జరుగగా 2023 అక్టోబర్ 27న రద్దయిందని తెలిపారు. ఆ తర్వాత 2023 అక్టోబర్ 30న రెండో ఒప్పందం జరిగిందన్నారు. రెండో ఒప్పందానికి ముందే హెచ్‌ఎండీఏ డబ్బులు చెల్లించడాన్ని బట్టి అవినీతి, అక్రమాలు జరిగాయని అర్ధం చేసుకోవచ్చునని, అవినీతికి ఇదే ప్రాథమిక ఆధారంగా పరిగణించొచ్చునని చెప్పారు. రెండో ఒప్పందాని కంటే ముందే..
అంటే 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో రెండు విడతలుగా రూ.54.88 కోట్లు హెచ్‌ఎండీఏ సాధారణ నిధుల నుంచి చెల్లించిందని చెప్పారు. మున్సిపల్ మంత్రి ఆధీనంలోనే హెచ్‌ఎండీఏ ఉంటుందని, ఆనాడు మున్సిపల్ మంత్రిగా పిటిషనర్ కేటీఆర్ ఉన్నారని, పిటిషనర్ చెప్పిన కారణంగా ఆర్థిక శాఖ అనుమతి కూడా లేకుండా నగదు చెల్లింపులు చేశారని చెప్పారు.
మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆమోదంతోనే హెచ్‌ఎండీఏ చెల్లించిందని, చట్ట ప్రకారం రూ.10 కోట్లకు మించి చెల్లింపులు జరపాలంటే ప్రభుత్వం నుంచి హెచ్‌ఎండీఏ అనుమతులు పొందితీరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత మొత్తం చెల్లించాలంటే ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందాలన్నారు.
ఈ నిబంధనలను గాలికి వదిలేసి చెల్లింపులు చేసేలా పిటిషనర్ మంత్రి హోదాలో అధికారులకు ఆదేశాలను జారీ చేశారన్నారు. రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా ఐఓబీ ద్వారా నేరుగా విదేశీ సంస్థలకు సొమ్ము చెల్లింపులు కూడా చట్ట వ్యతిరేకమన్నారు. విదేశీ సంస్థకు నగదు చెల్లించిన ఫలితంగా ఇన్‌కం ట్యాక్స్ కింద రూ.14 కోట్లు అదనంగా భారం పడిందని చెప్పారు.
ప్రమోటర్స్ బదులు ప్రభుత్వమే చెల్లింపులు..
ఫార్ముల ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఈఓ)కు సొమ్ము చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదు. ప్రమోటరే చెల్లించాలి. ఏస్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సొమ్ము చెల్లించనట్లయితే, ఆ మొత్తాన్ని రాబట్టేందుకు ఎఫ్‌ఈవో సూట్ వేసుకుంటుంది. ఇక్కడ ఏస్ జెన్‌ను రక్షించడానికి ప్రభుత్వం సొమ్ము చెల్లించింది. ప్రమోటర్ బ్యాంక్ గ్యారెంటీగా 200 వేల పౌండ్లు సమర్పించాల్సి ఉంది.. అని ఏజీ చెప్పారు.
ఈ సమయంలో హైకోర్టు జోక్యం చేసుకుని.. బ్యాంక్ గ్యారెంటీ సమర్పించారా, దాన్ని నగదుగా మార్చారా లేదా అని ప్రశ్నించింది. ఏసీబీ కేసు దర్యా ప్తు ఏ దశలో ఉంది, ఎంత మంది సాక్షుల స్టేట్మెంట్స్ రికార్డు చేశారు? అని ప్రశ్నించింది. దీనిపై ఏజీ జవాబు చెప్తూ ప్రస్తుతం ఫిర్యాదుదారు వాంగ్మూలాన్ని మాత్రమే ఏసీబీ నమోదు చేసిందన్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే కేటీఆర్ హైకోర్టుకు వచ్చారన్నారు. పిటిషనర్ కేటీఆర్ ఆమోదంతోనే రూ.54.88 కోట్ల హెచ్‌ఎండీఏ జనరల్ ఫండ్స్ నుంచి చెల్లింపులు జరిగాయని చెప్పా రు. 10 కోట్లు దాటితే ప్రభుత్వం, ఆర్థిక శాఖ, మంత్రిమండలి అనుమతి విధిగా పొందాలన్న నిబంధనలను ఉల్లంఘించారన్నారు.
ఇద్దరి విచారణకు అనుమతి
కేటీఆర్ విచారణకు గవర్నరు నుంచి, మరో నిందితుడు అర్వింద్‌కుమార్ విచారణకు చీఫ్ సెక్రటరీ నుంచి అనుమతి వచ్చిం దని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. మూడో నిందితుడైన హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీరు బీఎల్‌ఎన్‌రెడ్డి విచారణకు అనుమతి రావాలన్నారు. 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో జరిగిన చెల్లింపులకు ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకోలేదన్నారు.
విదేశీ సంస్థలకు చెల్లింపులు కూడా నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. ఈవ్యవహా రంపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిందన్నారు. ఐపీసీ 405, 409లు ప్రజాప్రతినిధులకు వర్తిస్తాయని, చంద్రబాబునాయుడు వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు కూడా నిర్ధారించిందన్నారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున కేసును కొట్టివేయాలని కోరారు.
గుంపగుత్తగా చట్టాల ఉల్లంఘన
ఫిర్యాదుదారుడైన మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రెండో ఒప్పందం చేసుకోడానికి ముందే రెండు విడతల్లో నగ దు చెల్లింపులు జరిగాయన్నారు. విదేశీ కరెన్సీ చెల్లింపుల నిబంధనలను ఉల్లంఘించిందన్నారు.
చట్టాలను గుంపగుత్తగా ఉల్లం ఘించారన్నారు. నిధులు ఎవరికి చెల్లించారో, చెల్లించామన్న సంస్థకు వెళ్లాయా, అక్కడి నుంచి ఆ నిధులు వేరే వాళ్లకు మళ్లిం పు జరిగిందా. అవినీతి ఎక్కడ జరిగింది, పిటిషనర్‌కే తిరిగి నిధులు చేరాయా.. వంటి అంశాలన్నీ దర్యాప్తులో తెలుతాయన్నారు. ఈ దశలో పిటిషనర్ వినతులను ఆమోదించవద్దని కోరారు.
పిటిషనర్ ఆధీనంలోనే సొమ్ము..
కేటీఆర్ ఏ లక్ష్యంతో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారో, అది మంచో చెడో తేలాల్సింది దర్యాప్తులో మాత్రమేనని దానకిషోర్ తరఫు సీనియర్ లాయర్ సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. ప్రభుత్వానికి చెందిన సొమ్ము నిర్వహణలో ఉల్లంఘనలు జరిగితే ఐపీసీ సెక్షన్ 405 వర్తిస్తుందన్నారు. అనుమతి లేకుండా ప్రభుత్వ సొమ్ము తరలింపు జరిగిందని అన్నారు.
చివరికి సొమ్ము చెల్లింపుల విధానాల ఉల్లంఘన జరిగిందన్నారు.ప్రాథమికంగా ప్రభుత్వ సొ మ్ము పిటిషనర్ అధీనంలో ఉందన్నారు. ఈ ఆరోపణల పరిధిలోనే కేటీఆర్ ఉన్నారని, దర్యాప్తును ఎదుర్కొనాల్సిందేనని చెప్పారు. ఒప్పందం లేకుండా చెల్లింపులు, మంత్రిగా పిటిషనర్ ఆదేశాలతో హెచ్‌ఎండీఏ చెల్లింపులు చేయడం ఈ రెండు కారణాలు దర్యా ప్తును కొనసాగించడానికి సరిపోతాయని చెప్పారు.
బిజినెస్ రూల్స్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పలు సుప్రీం కోర్టు తీర్పులను ఆయన ఉదహరించారు. కచ్చితమైన ఆధారాలు ఉన్నందున పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు, తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తీర్పు వెలువడే వరకు పిటిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవడం లేదా అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకోరాదని ఏసీబీని ఆదేశించింది.
లాభాలు రాష్ట్రానికి రాలేదు..
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి ఏమీ లాభాలు రాలేదని, స్పాన్సరర్లకే లాభాలు వచ్చాయని చెప్పారు. నిందితుల జాబితాలో ఫార్ములా ఈ సంస్థను ఎందుకు చేర్చలేదని పిటిషనర్ ప్రశ్నించడం ద్వారా కేసు నుంచి తప్పించుకునే తపన కనబడుతోందన్నారు.
ఫార్ములా ఈ-కార్ రేస్‌కు చెందిన కంపెనీ ఇంగ్లండ్‌కు చెందినదని, అన్ని అంశాలను పరిశీలించాకే కేసు నమోదు నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని, ఈ క్రమంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం జరిగిందని వివరించారు. దర్యాప్తులో తేలిన సమాచారం ఆధారంగా కొత్తగా నిందితులను చేర్చడం, అవసరమైతే ఉన్న వాళ్లను తొలగింపునకు వీలుంటుందన్నారు.
రాజకీయ, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలతో కేసు నమోదు చేశామనే వాదనలో పస లేదన్నారు. ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిగిందని, అక్టోబర్ 18న దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిందన్నారు. గవర్నర్‌కు కూడా సమాచారం ఇచ్చి పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు డిసెంబర్ 17న అనుమతి పొందినట్లు చెప్పారు.
కేసు ప్రాథమిక దర్యాప్తు కూడా ప్రారంభించకుండానే కేసును క్వాష్ చేయాలని పిటిషనర్ వేయడానికి వీల్లేదని, ఈ మేరకు సుప్రీం కోర్టు పలు తీర్పులు చెప్పిందని గుర్తుచేశారు. ఎఫ్‌ఐఆర్ చేయగానే కేసును కొట్టివేయాలని కేటీఆర్ కోరడం విడ్డూ రంగా ఉందన్నారు. కావాలంటే కేటీఆర్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలన్నారు.
చెల్లించిన సొమ్ము కేటీఆర్‌కే చేరిందా?
‘ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణ ఎవరి ప్రయోజనాల కోసం నిర్వహించారు? హైదరాబాద్ సిటీ కోసమా? మరొక ఆ వ్యక్తి కోసమా? ఫార్ములా ఈ రేస్ పేరుతో చెల్లింపులు చేసినట్లు చెబుతున్న సొమ్ము తరలింపు ఎక్కడికి చేరిందో తేల్చాల్సివుంది. ప్రభుత్వ సొమ్ము ఎక్కడికి వెళ్లింది? ఎవరికి చేరింది? కేటీఆర్‌కే చేరిందా? ఇవన్నీ ఏసీబీ దర్యాప్తులో తేలాల్సివుంది.
నిధులు ఎవరికి చేరాయో, నిజానికి ఫార్ములా ఈ రేసింగ్ ఎవరి కోసం నిర్వహించారో, రాష్ట్రం కోసమా లేక వ్యక్తి కోసం నిర్వహించారా.. ఇదీ కాకపోతే, ఎస్ జెన్‌ను రక్షించడానికే ప్రభుత్వ సొమ్ము చెల్లింపులు చేశారా.. రూ.54.88 కోట్లు ప్రభుత్వ నిధులు తరలి వెళ్లింది నిజం. రూల్స్ ఉల్లంఘన కూడా నిజం. సీజన్ 9 నిర్వహించిన స్పాన్సరర్లు సీజన్ 10 నిర్వహించే ముందుకు ఎందుకు తప్పుకున్నారు.
అప్పటికప్పుడు ఆ బాధ్యతలను హెచ్‌ఎండీఏ ఎలా తీసుకుంటుంది. మున్సిపల్ శాఖ ఆధీనంలోనే హెచ్‌ఎండీఏ ఉంది. ఆ శాఖ మంత్రిగా నిందితుడైన పిటిషనర్ ఆనాడు ఉన్నారు. మంత్రిగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగానే ఇవన్నీ జరిగాయి. పిటిషనర్ చెబుతున్నట్లుగా నిధులు బ్యాంక్ ద్వారానే వెళ్లాయి. ఒప్పందం కంటే ముందే చెల్లింపులు ఎందుకు చేశారు. కేసు దర్యాప్తునకు ఈ కారణాలు చాలు’.. అని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించారు.