calender_icon.png 17 October, 2024 | 3:36 AM

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

17-10-2024 02:03:08 AM

జడ్జి సెలవుల్లో ఉండటంతో నవంబర్ 14కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమైన ఈడీ!

ఆరేండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా.. మత్తయ్య

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : ఓటుకు నోటు కేసులో విచారణ మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 24న ఈ కేసును నాంపల్లి కోర్టు విచారించగా, విచారణకు మత్తయ్య హాజరు కాగా, సీఎం రేవంత్‌రెడ్డి సహా మిగతా నిందితులు గైర్హాజరయ్యారు.

దీంతో అక్టోబర్ 16న సీఎం రేవంత్‌రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో బుధవారం సీఎం కోర్టుకు హాజరవుతారా? లేదా అనే ఉత్కంఠ వాతావరణం నెలకొనగా.. కేసు విచారణ వాయిదా పడింది.

జడ్జి సెలవుల్లో ఉండటంతో విచారణను నవంబర్ 14కు కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం కోర్టుకు హాజరుకాలేదు. 

ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమైన ఈడీ!

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని, దానికి సంబంధించిన ఆధారాలను కోర్టులో సమర్పించేం దుకు ఈడీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి రూ.50 లక్షల మనీలాండరింగ్‌కు పాల్పడి.. 2019లో విచారణ సమయం లో సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఈడీ పేర్కొంది.

స్టీఫెన్‌సన్‌ను కలిసి అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేసేలా బేరం మాట్లాడమని తనని రేవంత్ పంపాడని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో మరో ముద్దాయి మత్తయ్య పేర్కొన్నారు.

ఆరేండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా : మత్తయ్య

ఈడీ కేసులో బుధవారం కోర్టుకు రావాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి రాకపోవడంతో ఈ కేసులో ఏ ఉన్న జెరూసలేం మత్తయ్య కోర్టు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఓటుకు నోటు కేసులో ఏ ఉన్న రేవంత్‌రెడ్డి కోర్టుకు హాజరుకావడం లేదు. కానీ, ఏ ఉన్న తాను ఆరేండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాననీ జెరూసలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి కోర్టుకు హాజరైతే ట్రయల్ స్టార్ట్ చేస్తామని ఈడీ కోర్టు న్యాయమూర్తి చెప్పా రు. అందుకే ఒకసారి కోర్టు విచారణకు హాజరుకావాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యులైన చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు. వేం నరేందర్‌రెడ్డి సీఎంవో ముఖ్య సలహాదారుగా, ఉదయ్ సింహా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పదవిలో ఉన్నారు.

మధ్యలో తాను ఎటు కాకుండా పోయానని వాపోయారు. రేవంత్‌రెడ్డి తన స్నేహితుడైన వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ పోస్టు ఇప్పించుకోవడానికి తనను బలి చేశారని ఆరో పించారు. రేవంత్‌రెడ్డి కోర్టుకు వచ్చి న్యాయస్థానం ముందు నిజం ఒప్పుకోవాలని, లేని పక్షంలో ఇప్పటి వరకు రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆధారాలు ఎక్కడెక్కడ  చెరిపివేశారో.. తిరిగి తన దగ్గరున్న అన్ని ఆధారాలను కోర్టుకు, దర్యాప్తు సంస్థలకు ఇస్తానని.. తనతోపాటు అందరికీ శిక్ష పడేటట్టు చేస్తానని మత్తయ్య హెచ్చరించారు.