పోస్ట్ కార్డుల ద్వారా సమస్యలపై విన్నపం..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): మావల మండలం కొమురం భీం కాలనీలో గత కొన్నేళ్లుగా నివసిస్తున్న ఆదివాసీల నివాస స్థలాలు ఇంటి పట్టాలు ఇచ్చి, నీళ్లు, కరెంటు, విద్య, వైద్యం, రోడ్డు సౌకర్యాలు కల్పించాలనీ ఆదివాసీల హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కొమురం భీం కాలనీలో నుండి పెద్ద ఎత్తున ఆదివాసీలు పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, నేషనల్ కమిషన్ షెడ్యూల్ ట్రైబ్స్ చైర్పర్సన్ అంతర్ సింగ్ ఆర్య, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాదే, సీఎం రేవంత్ రెడ్డి లకు పోస్ట్ కార్డుల ద్వారా తమ సమస్యలను వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర కొకన్వీనర్ గోడం గణేష్ మాట్లాడుతూ... అడవి బిడ్డల సమస్యలను మానవత దృక్పథంతో స్పందించి పరిష్కరించాలని అన్నారు. ఎన్నో ఏళ్లుగా సమస్యల మధ్య జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.