చరిత్రలో వారికి సముచిత స్థానం దక్కలేదు
స్వాతంత్య్రోద్యమంలో ఒక పార్టీకే క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది
గిరిజన వారసత్వ రక్షణకు ఎన్డీయే కట్టుబడి ఉంది
బిర్సా ముండా జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ
ప్రధాని విమానంలో సాంకేతిక లోపం
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఉదయం జార్ఖండ్‌లోని రెండు సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళ్లేందుకు దేవగఢ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయి తే మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అవ్వలేదు. దీంతో ప్రధాని ఢిల్లీ ప్రయాణంలో ఆలస్యం జరిగిందని అధికారులు వెల్లడించారు.
పాట్నా, నవంబర్ 15: భారత స్వాతంత్య్రోద్యమంలో గిరిజనుల పాత్రను గత ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. వారు చేసిన త్యాగాలకు సముచిత స్థానం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురయ్యారని, వారి సహకారాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రాన్ని ఒకే పార్టీ, ఓ కుటుంబానికి ఆపాదించే ప్రయత్నాలు జరిగాయని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.
బీహార్‌లోని జాముయ్‌లో శుక్రవారం భగవాన్ బిర్సా ముండా 150 జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ప్రసంగిస్తూ.. స్వాతంత్య్ర సాధనలో కేవలం ఒక పార్టీ, ఒక కుటుంబానికి క్రెడిట్ మొత్తం ఇవ్వాలనే ప్రయత్నం జరిగింది. ఒక కుటుంబం కారణంగా దేశానికి స్వాతంత్య్రం వస్తే గిరిజన నేత భగవాన్ బిర్సా ముండా ఉల్గులన్ ఉద్యమాన్ని ఎందకు మొదలుపెట్టారు.
గిరిజన నేతల పాత్రను ఎందుకు వి స్మరించాల్సి వచ్చింది. గిరిజన వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాళ్లకు రావాల్సిన గుర్తింపును ఇవ్వడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని మోదీ ఆరోపించారు.
ముర్ము రాష్ట్రపతి కావడం అదృష్టం
ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రకృతితో బలమైన అనుబంధం, పర్యావరణ పరిరక్షణలో గిరిజనుల పాత్రను కొనియాడారు. దేశ చరిత్రలో తొలిసారి ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీయే ప్రభుత్వం అదృష్టంగా భావిస్తోందని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము పేరును ప్రకటించగానే ఆమెను గెలిపించాలని దేశం మొత్తానికి బీహార్ సీఎం నితీశ్‌కుమార్ పిలుపునిచ్చిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు.
జన్‌మన్ యోజన ద్వారా..
ఆదివాసీల జనాభాను పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి జన్‌మన్ యో జన ద్వారా రూ.25 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. వేలమందికి శాశ్వత గృహ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. అంతేకాకుండా గిరిజన సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు వారి అభివృద్ధి కోసం ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ రూ.25 వేల కోట్ల నుంచి 1.25 లక్షల కోట్లకు పెంచుతామని వెల్లడించారు.
గిరిజన క్రీడాకారులకు కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. వీటితో పాటు 90 శాతం అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఉందని, గిరిజన వర్గాల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
బిర్సా జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్
భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకుని బీహార్‌లోని జా ముయ్‌లోని స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిర్సా ముండా పేరిట పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. రూ.6 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు.
25 ఏళ్లకే మృత్యువు ఒడికి..
యోధులు ఎక్కడి నుంచో రారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లను చూసి చలించే మనస్తత్వం నుంచే పుట్టుకొస్తారు. అలా ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన యోధుడే బిర్సా ముండా. బ్రిటిష్ ప్రభుత్వం గిరిజన ప్రజలను చిత్ర హింసలు పెడుతుంటే వాటిని చూసి బిర్సా ముండా తట్టుకోలేపోయారు. అడ్డగోలు పన్నులు, బలవంతపు భూ దోపిడీని అడ్డుకోవాలని యుక్త వయుసులోనే భావించారు. ఈ క్రమంలోనే బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటును లేవనెత్తారు. 1890లో ఉల్‌గులాన్ ఉద్యమా న్ని ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. రాజకీయ, మత రంగును పులుముకుని మరింత విస్తరించింది. 1899లో ఆయన మద్దతుదారులు ఆయుధాలతో పోలీస్ స్టేషన్లు సహా ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిపారు. గొరిల్లా తరహా ఉద్యమంతో బ్రిటిష్ పాలకుల్లో వణుకు పుట్టించారు. దీంతో అప్రమత్తమైన బిట్రిష్ ప్రభుత్వం బిర్సా ముండాను రెబల్‌గా ప్రకటిస్తూ అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన 1900 సంవత్సరంలో బిర్సాను చక్రధర పూర్ అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. రాంచీ జైలులో ఆయన జైలు జీవితం అనుభవిస్తూ 25ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. అయితే, ఆయన చనిపోవడానికి గల కారణాలపై అనుమానాలు ఉన్నాయి. అప్పటి అధికా రులు మాత్రం డెత్ రిపోర్ట్‌లో కలరా కారణంగా బిర్సా మరణించినట్టు పేర్కొ న్నారు. బిర్సా పోరాటలు వృథా కాలేదు. ఆయన ఉద్యమాల ఫలితంగా 1908లో బ్రిటిష్ ప్రభుత్వం ఛోటానాగ్‌పూర్ టెనె న్సీ చట్టాన్ని తీసుకొచ్చి గిరిజనుల భూ హక్కులను గుర్తించింది. ప్రస్తుత జార్ఖండ్‌లోని ఉలిహతు గ్రామంలో 1875 నవంబర్ 15న ‘ముండా’ అనే గిరిజన తెగలో జన్మించారు. పేదరికంలో పుట్టి పెరిగిన ఆయన తోటి గిరుజనులతో కలిసి వేటాడటం, వ్యవసాయం వంటివి చేశారు. బీర్సా చదువు సవ్యంగా సాగలేదు. ముందుగా ఓ మిషనరీ స్కూల్‌లో చేరిన ఆయన అక్కడ విద్యార్థులను బలవంతంగా క్రైస్తవ మతంలో మారు స్తున్నారని గ్రహించి దాన్ని వ్యతిరేకించారు. మత మార్పిడి జరిగే స్కూళ్లకు వెళ్లబోనని బడి మానేశారు. గిరిజన సంప్రదాయాలను బిర్సా ఎంతగానో గౌరవించారు. ఈ ఏడాది ఆయన 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని సరారీ కాలే ఖాన్ బస్టాండ్ పేరును బిర్సా ముండా చౌక్‌గా ప్రభుత్వం మార్చింది. గిరిజనులకు అందించిన సేవలు, స్వాతంత్య్ర పోరాట పటిమకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివరించారు.