అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు సహకరించవద్దు
సీఐ వెంకటేశ్వర్లు..
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని వలస ఆదివాసి గ్రామం విప్పుల గుంపు యువ క్రీడాకారులకు మంగళవారం ఏడూళ్ళ బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామంలోని యువకులకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఆదివాసి గ్రామాల్లోని యువత క్రీడల్లో రాణించి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామన్నారు.
నిషేధిత సిపిఐ మావోయిస్టులు తమ మనుగడ కోసం ఆదివాసి ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు సహకరించవద్దని, మావోయిస్టుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువతీ, యువకులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకొని తమ తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.