calender_icon.png 19 October, 2024 | 10:08 PM

ఆదివాసీ రోడ్లు అధ్వానం

28-07-2024 05:00:29 AM

  1. చినుకు పడితే చిత్తడి చిత్తడి 
  2. నరకయాతనగా ప్రయాణం 
  3. వాగు దాటితేనే ఊరు చేరేది 
  4. ఎడ్లబండ్లే అంబులెన్సు.. మంచాలే స్ట్రెచర్లు 
  5. ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల దుస్థితి

ఆదిలాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 18 మండలాల్లో చాలా మేరకు ఏజెన్సీ మండలాలే. అక్కడ అభివృద్ధి అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, జైనథ్, బేలా, బజారత్నూర్, సిరికొండ, తాంసి, తలమడుగు, బీంపూర్, ఇంద్రవెళ్లి, నేరడిగొండ, గుడిహత్నూర్ ఇలా అనేక మండలాల్లో మెజార్టీ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో మౌలిక వసతులు లేక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల ఆదివాసి గ్రామాలకు నేటికీ రోడ్ల సౌకర్యం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

చిత్తడి రోడ్లు.. దాటలేని వాగులు

జిల్లాలోని పలు గ్రామాలకు ఉన్న రోడ్ల పరిస్థితి వరాకాలంలో అధాన్నంగా మారుతుంది. చిన్నపాటి చినుకు పడితే చాలు రోడ్లన్నీ చిత్తడి గా మారి, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ రోడ్లపై వెళ్లాలంటే వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇక కాలినడకన వెళ్లే ప్రజల పడుతున్న నరకయాతన చెప్పక్కర్లేదు. మరోవైపు పలు గ్రామాల మధ్య ఉన్న వాగులపై వంతెనలు లేకపోవడంతో వరాకాలం వచ్చిందంటే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగులు దాటాల్సిన పరిస్థితి నెలకొంటుంది. 

వైద్య సిబ్బంది కష్టాలు  

వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు వైద్య చికిత్సలు అందించేందుకు వైద్య సిబ్బంది పడుతున్న కష్టాలు అన్నీఇన్ని కావు. వైద్య సిబ్బంది కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి ఆయా గ్రామాల్లో వైద్య సేవలను అందిస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అశోధ,  బొప్పపూర్, పూనగూడా, పిప్పలదరి, మంగ్లీ, శివగుడా, అల్లికోరి, రాజు గూడ, తిప్ప, బోరింగుడా, అడ్డగుట్ట, కొలం గూడా ఇలా మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరం నిరహించేందుకు వైద్య సిబ్బంది వాగులను దాటుతూ, కిలోమీటర్ల మేర వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎడ్లబండ్లే అంబులెన్స్‌లు..  

మారుమూల గ్రామాల్లోని ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు రావాలంటే ఇక అంతే సంగతు లు. చాలా గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేక వాగులపై వంతెనలు లేక ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న ప్రజలు ఆసుపత్రికి రావాలంటే సరై న రోడ్లు  లేకపోవడంతో వాహనాలు రాక ఎంతోమంది ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అత్యవసరమైతే ఎడ్ల బండే అంబులెన్స్, మంచాలే స్టెచ్చర్ లుగా మారుతాయి.