- పెరిగిన సోరెన్ పార్టీ బలం
- కూటమికి కలిసొచ్చిన విషయాలెన్నో..
- ప్రభావం చూపని అవినీతి ఆరోపణలు
- వరుసగా రెండో సారి కూడా జేఎంఎంకే పట్టం
రాంచీ: ఆదివాసీలు ఎక్కువగా ఉండే జార్ఖండ్‌లో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. జార్ఖండ్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఇక్కడి రాజకీయాలను పరిశీలిస్తే అక్కడి ఓటర్ల నాడి గురించి తెలుస్తుంది. ఎవరెన్ని ఆరోపణలు గుప్పించినా వారు అనుకున్నదే చేస్తారు. ఈ సారి కూడా ఎన్నికల్లో అదే జరిగింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు గుప్పిస్తూ అతడిని జైలులో పెట్టినా కానీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈ సారి కూడా అతడు సారధ్యం వహిస్తున్న జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా) పార్టీ ఘన విజయం సాధించింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే వరుసగా ఈ పార్టీ సాధించే ఓట్లు సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
రాజకీయ అనిశ్చితి
2000 సంవత్సరంలో ఏర్పడ్డ జార్ఖండ్ రాష్ట్రం రాజకీయ అనిశ్చితికి పెట్టింది పేరు. ఈ 24 సంవత్సారాల్లో ఏడుగురు వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పాలించగా.. మొత్తం 13 సార్లు వీరు సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతే కాకుండా 3 సార్లు రాష్ట్రపతి పాలనను కూడా విధించారు.
ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న జేఎంఎం పార్టీ పరిస్థితిని గురించి పరిశీలిస్తే ఆ పార్టీ వరుస ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోమారు సీఎం కుర్చీపై కూర్చున్న సోరెన్ ఇప్పుడు మరోమారు సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు.
దంపతుల విజయం
జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌తో పాటు ఆయన సతీమణి కల్పనా సోరెన్ కూడా ఈ సారి ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. హేమంత్ సోరెన్ బర్హుటై స్థానం నుంచి.. కల్పనా సోరెన్ గందే స్థానం నుంచి విజయబావుటా ఎగరేశారు. కానీ బీజేపీ తరఫున జంతారా స్థానం నుంచి పోటీ చేసిన హేమంత్ సోరెన్ వదిన సీతా ముర్ము సోరెన్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ అన్సారీ మీద 43వేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
కుంపటి మార్చినా..
సీనియర్ నేత చంపై సోరెన్ ఎన్నికలకు ముందు వరకు కూడా జేఎంఎంలో కీలకనేతగా ఉన్నారు. సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లినపుడు కూడా ఆయనే సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. కానీ హేమంత్ జైలు నుంచి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత బీజేపీ గూటికి చేరిపోయారు. తాజాగా బీజేపీ నుంచి సెరాయికెల్లా స్థానం నుంచి పోటీ చేసిన చంపై తన సమీప ప్రత్యర్థి జేఎంఎంకు చెందిన గణేశ్ మీద 20,447 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. చందన్‌కియారి స్థానం నుంచి పోటీ చేసిన ప్రతిపక్షనేత, బీజేపీ లీడర్ అమర్ కుమార్ బౌరి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఈ స్థానాన్ని కూడా జేఎంఎం కైవసం చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ ధన్వర్ నుంచి పోటీ చేసి జేఎంఎం అభ్యర్థి నిజాముద్దీన్ మీద 32,777 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.
ప్రభావం చూపని అవినీతి ఆరోపణలు
అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ సీఎం, జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపినా కానీ అది పెద్దగా ప్రభావం చూపించలేదు. అదేమీ పట్టించుకోని ఓటర్లు మరోమారు జేఎంఎంకే పట్టం కట్టారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సుడిగాలి పర్యటనలు చేసినా పక్క రాష్ట్రాల నుంచి ఎంత మంది నేతలు వచ్చి ప్రచారం చేసినా కానీ అవేమీ బీజేపీకి లాభించలేదు. జార్ఖండ్ ఓటర్లు వీటిని పట్టించుకోకుండా మరోసారి హేమంత్‌నే తమ సీఎంగా ఎన్నుకున్నారు.
ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు..
ఎన్నికల్లో గెలిచిన ప్రముఖులు
అభ్యర్థి నియోజకవర్గం పార్టీ మెజార్టీ
హేమంత్ సోరెన్ బర్హుతై జేఎంఎం 39,791
కల్పనా సోరెన్ గాందే జేఎంఎం 17,142
అలోక్ కుమార్ సోరెన్ సికారిపర జేఎంఎం 41,174
బసంత్ సోరేన్ ధుంకా జేఎంఎం 14,588
బాబులాల్ మరాండీ ధన్వాడ్ బీజేపీ 1,06,296
చంద్రదేవ్ మహతో సింద్రీ సీపీఐ (ఎంఎల్)- లిబరేషన్ 3,448
శ్వేతా సింగ్ బొకారో కాంగ్రెస్ 7,207
కీలకమైన నియోజకవర్గాల్లో గెలిచిన వారు..
అభ్యర్థి నియోజకవర్గం పార్టీ మెజార్టీ
రాంచీ చంద్రేశ్వర్ ప్రసాద్ సింగ్ బీజేపీ 21,949
లోహర్దగ రమేశ్వర్ ఓరాన్ కాంగ్రెస్ 34,670
జాంతర ఇర్ఫాన్ అన్సారీ కాంగ్రెస్ 43,676
ఝంషెడ్‌పూర్ ఈస్ట్ పుర్ణిమ సాహు బీజేపీ 42,871
ఝంషెడ్‌పూర్ వెస్ట్ సరయు రాయ్ జనతాదళ్ (యూ) 7,863
హుస్సేనాబాద్ సంజయ్‌కుమార్ సింగ్ ఆర్‌జేఎల్ 34,364
ధన్‌బాద్ రాజ్ సింహా బీజేపీ 48,741
బిష్ణుపూర్ చమ్రా లిందా జేఎంఎం 32,756