ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆదివాసీ గూడేలు ఆగమైనట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అనేక సమస్యల సుడిగండంలో చిక్కుకున్నాయని విమర్శించారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి ఆదివాసీ సంఘాలతో భేటీ అయిన నేపథ్యంలో ఈ మేరకు కవిత ఒక ప్రకటన విడుదల చేశారు.
బీఆర్‌ఎస్ చేసిన పోరాటాల ఫలితంగానే ఆదివాసీ సంఘాలతో సీఎం భేటీ అయ్యారన్నారు. ఇటీవల తాను ఆదివాసీ గూడేలను సందర్శించినట్లు చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో చేశారని వివరించారు.
గూడేల్లోని ప్రజల విద్య, వైద్యంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు కుదేలయ్యాయని, వాటిల్లో చదవుకోవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. తక్షణమే ఆదివాసీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్ చేశారు.