calender_icon.png 22 September, 2024 | 4:35 AM

ఆదివాసీల బంద్ ప్రశాంతం

22-09-2024 01:49:49 AM

  1. ఆదివాసి మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడ్ని ఉరితీయాలని డిమాండ్
  2. జైనూర్ అల్లర్ల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు

ఆదిలాబాద్/నిర్మల్/కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరులో ఆదివాసీ మహిళపై జరిగిన లైంగిక దాడి, హత్యాయత్నానికి నిరసనగా ఆదివాసీ సంఘాలు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ర్ట బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ)తో పాటు 9 ఆదివాసీ తెగల సంఘాలు కలిసి బంద్‌లో పాల్గొన్నాయి. జైనూర్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి. ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట తుడుం దెబ్బ నాయకులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. నిర్మల్ పట్టణంలో ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోనూ బంద్ సంపూర్ణమైంది. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ర్ట కో కనీనర్ గోడం గణేష్ మాట్లాడుతూ.. ఆదివాసి మహిళపై అఘైత్యానికి ఒడిగట్టిన ఎస్‌కె మగ్దూంను ఉరితీయాలని డిమాండ్ చేశారు.